మెట్పల్లి/కోరుట్ల, ఏప్రిల్ 8:యాసంగిలో పండించిన వడ్లను కొనేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తేల్చిచెప్పారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై శుక్రవారం మెట్పల్లి, కోరుట్ల పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తన నివాసంపై నల్లజెండాను కట్టి నిరసన తెలిపారు. పార్టీ నాయకులు కూడా తమ ఇళ్లపై నల్ల జెండాలను కట్టారు. ఎమ్మెల్యే నివాసం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్, బస్టాండ్, డిపో, తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది. పాతబస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపుతున్నదని, దేశ వ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికో విధంగా వ్యవహరిస్తున్నదన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం దిగొచ్చి వడ్లు కొనేదాకా రైతులకు అండగా ఉండి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, నాయకులు లింగంపల్లి సంజీవ్, తిరుసుల్ల అర్జున్, సుధాకర్‌గౌడ్, అంగడి పురుషోత్తం, మన్నె ఖాన్, కిషోర్, ఆకుల ప్రవీణ్, మెడిచెల్మెల నాని, అలీం, జావీద్, పిప్పెర రాజేశ్, రఘు, ఒజ్జెల శ్రీనివాస్, పిప్పెర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.