సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 7: రాష్ట్రంలో సంబురంగా ఉన్న రైతులను చూసి ఓర్వలేక కేంద్రం కుట్రలు పన్నుతున్నది. యాసంగి వడ్లు కొనలేమని డ్రామాలు మొదలు పెట్టింది. గత కేంద్ర ప్రభుత్వాలు యాసంగి ధాన్యాన్ని కొన్నాయి. మరి బీజేపీ సర్కారు ఎందుకు కొనదు? కేంద్రంతో ప్రతి గింజను కొనిపించే బాధ్యత మాదేనంటూ మాయమాటలు చెప్పిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇప్పుడు ఎటు పోయిన్రు. రైతులకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలి. వడ్లు కొనాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వద్దకు వెళ్తే.. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయించండని అవమానపరిచిండు. తెలంగాణ ప్రజలను హేళన చేసిన వారికి నూకలు లేకుండా చేస్తాం. చివరి గింజా కొనకుంటే చిచ్చురేపుతాం. మోదీ సర్కారు వైఖరికి నిరసనగా నేడు ప్రతి రైతు ఇంటిపైనా నల్ల జెండాలు ఎగురవేయాలి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలి. ఆ నిరసన సెగ ఢిల్లీకి తాకాలి. నోటితో వెక్కిరించి కడుపులో గుద్దుతున్న ఈ దుర్మార్గపు బీజేపీ కుటిల యత్నాన్ని తిప్పికొట్టాలి.
తెలంగాణలో సంబురంగా ఉన్న రైతులను చూసి ఓర్వలేకనే కేంద్రం కుట్రలు పన్నుతున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్న బీజేపీ ప్రభుత్వం తోకలు కత్తిరిద్దామని పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రతి రైతు ఇంటిపైనా నల్ల జెండాలు ఎగురవేసి, కేంద్రం దిష్టిబొమ్మను తగులపెట్టాలని పిలుపు నిచ్చారు. నోటితో వెక్కిరించి కడుపులో గుద్దుతున్న ఈ దుర్మార్గపు బీజేపీ కుటిల యత్నాన్ని తిప్పికొట్టాలని, ఢిల్లీకి సెగ తగిలేలా సావుడప్పు కొట్టాలని, రైతులకు మద్దతుగా ఉద్యమంలో యువత పాల్గొనాలని కోరారు. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహా ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై, సభావేదికపై నుంచి రైతులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ టీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలను జీర్ణించుకోలేక యాసంగి వడ్లు కొనలేమని కేంద్రం డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు.
ధాన్యాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు కొనలేదా..? మరి మీకెందుకు సమస్య అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ యాసంగి పంట ఉప్పుడు బియ్యానికి కూడా పనికిరాదని.. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండని అవమానపరిచేలా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలను, రైతులను కించపరిచినట్లు మాట్లాడితే బీజేపీ అంతుచూస్తామని హెచ్చరించారు. రైతు, పేదల సంక్షేమ పథకాలతో తెలంగాణలో టీఆర్ఎస్ శాశ్వతంగా పాగా వేస్తుందని, వారికి జాగ దొరకదేమోనన్న భయంతోనే ధాన్యం చిచ్చుపెట్టిందని మండిపడ్డారు. అన్నదాతను కేంద్ర ప్రభుత్వం సందిగ్ధ స్థితిలో నెట్టివేస్తుందని ముందే గమనించిన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతేడాది నవంబర్ 12న నియోజకవర్గాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించి నవంబర్ 18న హైదరాబాద్‌లో ధర్నా చేసి పంట మార్పిడి చేయాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే బాయిల్డ్, రారైస్ కొనేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తమదేనంటూ రైతులను రెచ్చగొట్టిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్, కిషన్‌రెడ్డి యాసంగి పంటను కొనుగోలు చేస్తామన్న వీడియో క్లిప్‌లతో పాటు కేంద్ర మంత్రులు స్మృతీ ఇరాని, నిర్మలా సీతారామన్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఢిల్లీ బీజేపీకి.. గల్లీ బీజేపీకి సంబంధంలేకుండా మాట్లాడి రైతులను అయోమయానికి గురిచేశారన్నారు. రాజ్యాంగబద్ధంగా ఆహారభద్రతా చట్టాన్ని అనుసరించి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా అన్ని రాష్ర్టాల పంట ఉత్పత్తులు కొనాలని ఉన్నా తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. కేంద్రం దిగివచ్చి వడ్లు కొనేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
అడ్డగోలు ధరలు పెంచి ప్రజలను ఆగం చేస్తున్నది
కేంద్రంలోని దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు ధరలు పెంచి ప్రజలను ఆగం చేస్తున్నది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదంటూ బీజేపీ నేతలు ఆందోళనలు చేశారు. మరి మోదీ సర్కారు ఇప్పుడేం చేస్తున్నది. ధరలు పెంచి తిప్పలు పెట్టడం లేదా? ఎనిమిదేండ్ల క్రితం రూ.410ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు రూ.1002కు చేరింది. లక్ష కోట్ల గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి సామాన్యుడికి గ్యాస్ సిలిండర్‌ను గుదిబండగా మార్చారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దేశం కోసం ధర్మం కోసం అంటూ నీతులు వల్లిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధమే కారణమని సాకులు చెబుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి పెరిగిన ధరలకు ఏమైనా సంబంధం ఉన్నదా? ప్రజలంతా ఆలోచించాలె.
– మంత్రి కేటీఆర్