కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/కార్పొరేషన్ : రైతుల పక్షాన టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. జిల్లా నలుమూలల నుంచి గులాబీ దండు వేలాదిగా తరలివచ్చి కేంద్రంపై పిడికిలెత్తింది. అన్నదాత గోసను ఢిల్లీకి వినిపించేలా.. మోదీ సర్కారు తీరును ఎండగట్టింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ నిరసనలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు పాడి కౌశికర్రెడ్డి, భానుప్రసాద్‌రావు, జడ్పీ చైర్పర్సన్ విజయ పాల్గొని, కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వడ్లు కొనేదాకా వదిలేదే లేదని తేల్చిచెప్పారు. నేడు ఊరూరా రైతుల ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పండించిన యాసంగి వడ్లను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట వద్ద గురువారం నిర్వహించిన రైతు మహాధర్నా సక్సెస్ అయింది. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఈ ప్రాంతమంతా దద్దరిల్లింది. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నా మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఆర్బీఎస్ కన్వీనర్ గూడెల్లి తిరుపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నదని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం యాసంగి వడ్లు కొనేదాకా వదిలేది లేదని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేడు అన్ని గ్రామాల్లోనూ రైతులు ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని, బైక్ ర్యాలీలు తీయాలని పిలుపునిచ్చారు. మరో వైపు రైతులు సైతం మద్దతు పలికారు. టీఆర్ఎస్తో కలిసి పోరాడుతామని తేల్చి చెప్పారు.
కొనేదాకా పోరాడుతాం
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేదాకా టీఆర్ఎస్తో కలిసి పోరాడుతాం. రైతులకు అండగా టీఆర్ఎస్ ఉంది. కేంద్రంతో పోరాడుతుందనే నమ్మకం ఉన్నది. ఎంత దూరమైనా సరే పోరాడుతాం. రాష్ట్రం మీద కేంద్రం ఎందుకింత వివక్ష చూపుతున్నదో అర్థం కావడం లేదు. రైతులు బాగు పడితే కేంద్రానికి ఎందుకింద కండ్లమంట. ఒక పక్క టీఆర్ఎస్ పథకాలను కాపీ కొడుతూ ఇక్కడి రైతులను మాత్రం అణగదొక్కాలని చూస్తోంది.
– నల్ల కోమల్‌రెడ్డి, కోర్కల్, వీణవంక మండలం
రెచ్చగొట్టి ముఖం చాటేశారెందుకు?
కేంద్రం తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలి. లేదంటే వడ్లను ఇక్కడి బీజేపీ నేతల ఇండ్ల ముందు పోసి నిరసన తెలుపుతాం. పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని రైతులను రెచ్చగొట్టిన నేతలు ఎక్కడికి పోయారు. బాధ్యత తీసుకుంటామని గొప్పలు చెప్పిన బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇప్పుడు ముఖం చాటేశారేందుకు? ప్రజలకు చూపించేందుకు వారికి ముఖాలు చెల్లడం లేదా? తెలంగాణ రైతులు బాగుపడడాన్ని చూసి కేంద్రం కండ్లు మండుతున్నయ్. అందుకే వడ్లు కొనబోమంటూ కొర్రీలు పెడుతున్నరు. వారి మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయిస్తాం.
– ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
ధాన్యంపై ద్వంద్వ వైఖరెందుకు?
అన్ని రంగాల్లో ‘వన్ నేషన్..వన్ పాలసీ’ అంటూ ఊదరగోడుతున్న మోదీ సర్కారు ధాన్యం కొనుగోలుపై ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తున్నది. వడ్లకు మద్దతు ధర ప్రకటించి బాయిల్డ్ రైస్ కొనబోమంటూ కేంద్రమంత్రి అనడంలో అంతర్యమేంటో చెప్పాలి. బీజేపీ ప్రభుత్వానికి కోపం ఉంటే టీఆర్ఎస్పై చూపించాలి. అంతేగాని రైతులను ఇబ్బందులు పెట్టడమెందుకు. తెలంగాణలో యాసంగి పంటలు వేసే టైంల వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొట్టిన బండి సంజయ్ నోరు మెదపడం లేదు. కేంద్రం ధాన్యాన్ని కొనబోమని చెప్పినా ఉలుకు పలుకు లేదు. తప్పుడు వాగ్దానాలు చేసిన ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి.
– ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు
బీజేపీకి నూకలు చెల్లేలా చేయాలి
నూకలు తినాలని తెలంగాణ ప్రజలను వెక్కిరించిన బీజేపీ పార్టీకి ఇక్కడ నూకలు చెల్లేవిధంగా చేయాలి. ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమివేయాలి. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కండ్లుమండే వడ్లను కొనబోమంటూ వంకలు చెబుతున్నది. రాష్ట్రం కోసం పోరాడిన స్ఫూర్తితో రైతుల పక్షాన టీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. కేంద్రం దిగివచ్చి ధాన్యం కొనేదాకా కొట్లాడుతుంది. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నరు..తగిన సమయంలో వారికి బుద్ధిచెబుతరు.
– కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ
కొనేదాకా వదలం
యాసంగి వడ్లు కొనేదాకా కేంద్రంతో పోరాటం తప్పదు. శాంతియుతంగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నట్లే రైతుల పక్షాన పోరాడి రాజ్యాంగ పరమైన హక్కులను సాధించుకుందాం. వ్యవసాయంపై పెట్టేది పెట్టుబడి కాదు. అది ప్రభుత్వాల సామాజిక బాధ్యత. కేంద్రంలో ఉన్నది ప్రభుత్వమా..? వ్యాపార సంస్థనా..? తెలంగాణలో పండే పత్తితో లాభాలు వస్తున్నాయని సీసీఐ ద్వారా కొంటున్న కేంద్రం.. నష్టాలు వస్తున్నాయని ఎఫ్‌సీఐ ద్వారా యాసంగి వడ్లను మాత్రం కొనేది లేదంటోంది. అలాంటప్పుడు మేమెందుకు జీఎస్టీ చెల్లించాలి? ఇన్‌కాం టాక్స్ ఎందుకు కట్టాలి? మేం భారతీయులం కాదా..? తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా..? ఎఫ్‌సీఐ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో వానకాలంలో రా రైస్, యాసింగిలో బాయిల్డ్ రైస్ కేంద్రమే కొంటున్నది. ఇప్పుడు కొత్త రూల్ తెచ్చి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నరు? మేమేమీ భిక్షమేయమని అడగడం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడుతున్నం.
– మంత్రి గంగుల కమలాకర్
బీజేపీ నేతలను నిలదీయాలి
వడ్ల కొనుగోలుపై గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ సర్కారును బండకేసి కొట్టాలి.. పంటలు వేసే సమయంలో ధాన్యం కొంటామని బీరాలు పలికిన బండి సంజయ్‌ను అడుగడుగునా నిలదీయాలి. ఇప్పుడు వరి కోతల సమయం దగ్గరపడ్డది. రైతులపై చిత్తశుద్ధి ఉంటే వడ్ల కొనుగోలుపై మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. మాట తప్పితే అన్నదాతలు తగిన బుద్ధిచెప్పాలి. లేకుంటే ఆ పార్టీ నేతలను ఊరూరా నిలదీయాలి.
– జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు