విద్యానగర్, ఏప్రిల్ 7: వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లాకు పలు అవార్డులు దక్కాయి. కొవిడ్ సమయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కొవిడ్ హాస్పిటల్‌గా కరీంనగర్ ప్రభుత్వ దవాఖానను ఎంపిక చేసింది. ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా తులసి రవీందర్, కొత్తపల్లి పీహెచ్సీ పరిధిలోని బొమ్మకల్ సబ్ సెంటర్లో పని చేస్తున్న శంకరమ్మ ఉత్తమ ఆశ కార్యకర్త అవార్డుకు ఎంపికయ్యారు. గురువారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, డీహెచ్ శ్రీనివాసరావు చేతుల మీదుగా కరీంనగర్ ప్రభుత్వ దవాఖాన తరఫున సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాలతో పాటు వీరు అవార్డులు అందుకున్నారు. అంతే కాకుండా, ఎంసీహెచ్‌లో కొవిడ్ పాజిటివ్ వచ్చిన ఎక్కువ మంది గర్భిణులకు ప్రసవం చేసినందుకు హెచ్‌వోడీ డాక్టర్ మంజులకు అవార్డు అందజేసి, సత్కరించారు. కాగా, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్ వైద్యారోగ్యశాఖలో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు ప్రతి పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు. రవీందర్‌ను డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, వైద్యులు, సిబ్బంది అభినందించగా, డాక్టర్ రత్నమాలకు వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. తనకు అవార్డు రావడానికి సహకరించిన ప్రభుత్వ దవాఖాన వైద్యులు, సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.