పెద్దపల్లి జంక్షన్, ఏప్రిల్ 7: జిల్లాలో ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి పనులు జరుగాలని కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. పట్టణ ప్రగతి, మొకల సంరక్షణ, టీఎస్ బీపాస్ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లతో గురువారం తన చాంబర్లో గురువారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎండల తీవ్రత దృష్ట్యా స్వచ్ఛంద సంస్థల ద్వారా అధికసంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చొరవ చూపాలన్నారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం 10 శాతం బడ్జెట్ను వినియోగించి నాటిన మొకలను పూర్తిస్థాయిలో సంరక్షించాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొకలకు ట్రీగార్డులను ఏర్పాటు చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు నీళ్లు పోయాలని, వాటర్ ట్యాంకర్లు సరిపోని పక్షంలో సమీప గ్రామాల నుంచి తెప్పించుకుని సాయంత్రం తప్పనిసరిగా నీరు పోయాలని సూచించారు.
నర్సరీల్లో మొకలు చనిపోకుండా జాగ్రత్త వహించాలని, పట్టణాల్లో మియావాకి ద్వారా ఏర్పాటు చేసిన పారుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని, గతేడాది పెండింగ్ బకాయిలపై దృష్టి సారించాలని సూచించారు. అనుమతుల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయా? లేదా? తెలుసుకునేందుకు విజిలెన్స్ బృందాలు తనిఖీ చేయాలన్నారు. సకాలంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని, పట్టణాల్లో అనుమతి లేని హోర్డింగ్లను తొలగించాలన్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందించాలని, స్త్రీ నిధి, మెప్మా రుణాలు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బడులు, దవాఖానల్లో పారిశుధ్య నిర్వహణను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగునీటి సమస్య రాకుండా చూడాలని, మిషన్ భగీరథ బల్ నీటి సరఫరాను సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్లో ఉన్న అంతర్గత మిషన్ భగీరథ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కుమార్దీపక్ తదితరులు పాల్గొన్నారు.