కరీంనగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతన్న పక్షాన టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణలో పండించిన వడ్లను కొనకుండా అరిగోస పెడుతున్న కేంద్రంపై యుద్ధం చేస్తున్నది. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, డీసీసీబీలు, డీసీఎంఎస్ పాలక మండళ్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపించారు. అన్నదాత గోస ఢిల్లీకి వినిపించేలా ఈ నెల 4 నుంచి రెండో విడుత ఉద్యమం ఉధృతం చేశారు. మొదటి రోజు అన్ని మండలాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. 6వ తేదీన జాతీయ రహదారులను దిగ్బంధించారు. నేడు (గురువారం) అన్ని జిల్లాకేంద్రంలో నిరసన దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు విజయవంతం చేయడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. బుధవారం అన్ని జిల్లాలోనూ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి, సన్నద్ధం చేశారు.
రైతులతో కలిసి పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనే వరకు ఉద్యమిద్దామన్నారు. ఇటు రేపటి (శుక్రవారం) నుంచి గ్రామస్థాయిలో నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ ఉద్యమంలో రాష్ట్రంలోని ప్రతి రైతునూ భాగస్వామ్యం చేయాలని, ఊరూరా ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసేలా సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మున్సిపాలిటీల్లోనూ నల్లజెండాలు ఎగురవేయడంతోపాటు బైక్ ర్యాలీలు తీయాలన్నారు. పాలకుర్తి మండలం ముంజంపల్లి, మారేడుపల్లిలోని నాయకులతో మారేడుపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశమై చర్చించారు. ఎంపీపీ వ్యాళ్ల అనసూర్యరాంరెడ్డి, జడ్పీటీసీ కందులసంధ్యారాణి, సింగిల్‌విండో చైర్మన్ బయ్యపుమనోహార్రెడ్డి, సర్పంచులు పల్లే అశోక్, గంధం లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల రాంరెడ్డి, పందిళ్ల రాజిరెడ్డి, కొమ్ముసంజీవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామాల్లోని రైతుల ఇండ్లపై నల్లా జెండాలు ఎగురవేయాలని కోరుతూ రామడుగు మండలంలో నల్లజెండాలు పంపిణీ చేశారు.
పాల్గొననున్న మంత్రులు కేటీఆర్, కొప్పుల, గంగుల
అన్ని జిల్లాకేంద్రాల్లో గురువారం నిరసన దీక్షలు చేపట్టనున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మహాధర్నా నిర్వహించనుండగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఆయన వెంటే ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ హాజరుకానున్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద నిరసన దీక్ష చేపట్టనుండగా, మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొననున్నారు. కరీంనగర్లో కలెక్టరేట్ వద్ద మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి.. పెద్దపల్లిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, ఎల్ రమణ, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొనున్నారు. వీరివెంటే ముఖ్యనేతలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరానుండగా, అన్ని జిల్లాకేంద్రాల్లోనూ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
నల్ల జెండాలు ఎగురవేయాలి
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్రం కొనుగోలు చేసేదాకా పోరాటం ఆపేదిలేదని టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగే నిరసనలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎంపీపీ జాజాల భీమేశ్వరి, పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లాల దశరథ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, నాయకులు సత్యనారాయణ, చిన్నారెడ్డి, రాములు, వెంకట్, జగన్ రావు, బద్దం గోపి, తుకారాం, సోమ ప్రభాకర్, నేమూరి లత, పడాల మమత, తదితరులు పాల్గొన్నారు.
పోరుకు నడుం బిగించాలి
యాసంగి వడ్ల కొనుగోలు కోసం కేంద్రంపై పోరుకు నడుం బిగించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 8న గ్రామాల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయాలన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న నిరసనలో నియోజకవర్గం నుంచి 3వేల మంది పాల్గొంటారని చెప్పారు. అలాగే శుక్రవారం గ్రామాల్లో నిర్వహించే రైతు నిరసనల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
దిగొచ్చే దాకా ఉద్యమిద్దాం
తెలంగాణలో సాగునీటి పథకాలు సాకారం కావడంతో గతంలో కన్నా వరి దిగుబడి పెరిగింది. పంట బాగా వచ్చిందని రైతులు సంబురపడుతున్న సమయంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ధాన్యం కొనకుండా తెలంగాణ రైతులను అరిగోస పెడుతున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలపై అహంకార పూరితంగా మాట్లాడారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. గోయల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి. కేంద్రం తన వైఖరిని మార్చుకోవాలి. పంజాబ్ తరహాలో ధాన్యం చివరి గింజ వరకు కొనాలి. అప్పటిదాకా పోరాటం ఆపేది లేదు. బీజేపీకి బుద్ధి వచ్చేంత వరకు ఉద్యమిద్దాం. ఈనెల 7న జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు నిరసన దీక్షను విజయవంతం చేద్దాం. 8న ఊరూరా ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేద్దాం. తెలంగాణకు ద్రోహం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుదాం.
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (గోదావరిఖని)
పోరాటం ఆపేది లేదు
యాసంగి వడ్లు కొనేదాకా పోరాటం ఆపేదిలేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కేంద్రం తీరును నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద చేపట్టే కార్యక్రమంపై చర్చించారు. రాష్ట్రాలు పండించిన ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్రానిదేనని, మోదీ సర్కారు దిగొచ్చేదాకా ఆందోళన చేస్తామన్నారు. నాయకులు గందె రాధిక, ఎడవెల్లి కొండల్ రెడ్డి, తోట రాజేంద్రప్రసాద్, కొలిపాక శ్రీనివాస్, కన్నెబోయిన శ్రీనివాస్, ఇరుమళ్ల సురేందర్ రెడ్డి, మైఖేల్, దాసరి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విరమించేది లేదు
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనే వరకూ పోరును విరమించేదిలేదని, అప్పటి వరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని నగర మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న నిరసన దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆందోళనకు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చేవారికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మేయర్ వెంట కార్పొరేటర్ భూమాగౌడ్, నాయకులు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.