ధర్మపురి, ఏప్రిల్ 6: రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంపై పిడికిలెత్తాలని, యాసంగి ధాన్యం కొనేదాకా దించబోమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే తెలంగాణ సర్కారు లక్ష్యమని, వారి కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. బుధవారం ధర్మపురి మండలం రాయపట్నంలో నాబార్డు నిధులు రూ.38.60 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో సహకార సంఘ గోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో పలు వీధుల్లో రూ.15లక్షల నిధులతో సైడ్ డ్రైన్, రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.
అపరభగీరథుడు సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, పుష్కలంగా ధాన్యం పండుతూ అన్నపూర్ణగా నిలిచిందని, మరి ధాన్యం కొనకపోతే వ్యవసాయం రంగ పరిస్థితి ఏంటో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, ఆలోచనలు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విషయంలో.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర సర్కారు అసమర్థత కనిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. బాధ్యతను మరిచి రైతన్నను ఇబ్బంది పెడుతున్న కేంద్రానికి బుద్ధి వచ్చేలా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపడుతున్న పోరాటానికి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు మద్దతుగా రావడం అభినందనీయమన్నారు. కేంద్రం దిగివచ్చేదాక ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. సీఎం సూచించిన విధం గా ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసనలు తెలుపాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు, రైతులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. రెండు రహదారులను కలిపే రాయపట్నం కూడలి వద్ద సుందరీకరణ పనులు చేపడుతామని తెలిపారు. కాగా, ఒకప్పటి సమస్యాత్మక ప్రాంతమైన రాయపట్నంలో రాత్రి పూట మంత్రి పర్యటన దృష్ట్యా డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో సీఐ కోటేశ్వర్ సూచనల మేరకు ఎస్ఐ కిరణ్‌కుమార్ బందోబస్తు చేపట్టారు. ఇక్కడ ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, రాయపట్నం సర్పంచ్ ఈర్ల చిన్నక్క మొండయ్య, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు వసంత్, తదితరులు ఉన్నారు.