కలెక్టరేట్, ఏప్రిల్ 2 : గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిచేస్తున్న రక్తహీనత వ్యాధికి ఇక చెక్ పడనుంది. దీని నుంచి వారిని కాపాడి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటికే పోషకాహారం పంపిణీ చేస్తుండగా, దీంతో పాటు మరింత బలవర్ధకమైన ఆహారాన్ని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల ద్వారా అందించేందుకు నిర్ణయించింది. ఈమేరకు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. అనంతరం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఈ నెలాఖరునుంచి అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతలకు ఈ కిట్లు చేరేలా తగిన ఏర్పాట్లు చేయడంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిమగ్నమైంది. ఇప్పటికే ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు న్యూట్రిషన్ సప్లిమెంటరీ ప్రోగ్రాం కింద పోషకాహారాన్ని అందిస్తున్నది. అయినప్పటికీ రక్తహీనత సమస్య షరా మామూలు అన్నట్లుగా మారింది.
దీనిని అధిగమించేందుకు బలవర్ధకమైన ఆహారం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనతో, కొత్తగా ’కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పేరుతో పలు రకాల పోషకాహారంతో కూడిన కిట్లు పంపిణీ చేసేందుకకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలతో పాటు, డ్రైప్రూట్స్, బెల్లంతో తయారు చేసిన పల్లి పట్టీలు, నువ్వుల ఉండలు, అధిక మాంసకృత్తులు కలిగిన ఆహారోత్పత్తులు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. దీని ద్వారా జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గల 777 అంగన్వాడీ కేంద్రాల్లోని 13,440 మంది గర్భిణులు, బాలింతలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా వీరికి ప్రతి రోజూ 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల వంట నూనె, ఒక గుడ్డుతో ఆహారం తయారు చేసి అందిస్తున్నారు. అలాగే 200 మి.లీ.పాలు పంపిణీ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా రక్తహీనత సమస్య చాలా మందిని పట్టి పీడిస్తోంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కిట్ ద్వారా పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటుండడంపై గర్భిణులు, బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.