కార్పొరేషన్, ఏప్రిల్ 6: నగరంలోని అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. నగరంలోని 42, 9వ డివిజన్లలో బుధవారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయా డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగరంలోని అన్ని డివిజన్లలో ప్రస్తుతం అభివృద్ధి పనులు సాగుతున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనే ధ్యేయంగా బల్దియా పాలకవర్గం ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. నగరంలో వానకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా వరదకాల్వల నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తున్నామన్నారు. అలాగే, అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శివారు డివిజన్లలో మంచినీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అత్యధిక నిధులు కేటాయించి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. మార్కెట్లు, ఇతర సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మాణాలు చేస్తున్నామన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్లు ఐలేందర్‌యాదవ్, మేచినేని వనజ-అశోక్‌రావు, ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.