కార్పొరేషన్, ఏప్రిల్ 6: నగరాలు, పట్టణాల్లో ప్రతి రోజూ వెలువడుతున్న చెత్తతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతి పట్టణంలో ఏళ్ల తరబడిగా పేరుకుపోయిన చెత్త గుట్టలు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడూ క్లీనింగ్ చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. నగర, పట్టణ శివారుల్లో పేరుకుపోతున్న డంప్ యార్డులతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన రావడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించి వాయుకాలుష్యం ఏర్పడుతున్నది. ఈ సమస్య పరిష్కారంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో బయోమైనింగ్ విధానంలో క్లీనింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆయా సంస్థలకు ఈ క్లీనింగ్ బాధ్యతలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే అన్ని పట్టణాల్లో చెత్త సమస్య పరిష్కారమవుతుంది.
అన్ని మున్సిపాలిటీల్లో క్లీనింగ్
జిల్లాలో కరీంనగర్ నగరపాలక సంస్థతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా కరీంనగర్‌లోని డంప్ యార్డును బయోమైనింగ్ పద్ధతిలో క్లీన్ చేసేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. 18 నెలల్లోగా ఈ డంప్ యార్డును క్లీన్ చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులు అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. అలాగే, ప్రస్తుతం ఉన్న డంప్ యార్డును క్లీన్ చేయడంతో పాటు ప్రతి రోజూ నగరంలో వెలువడుతున్న చెత్తను వర్మీ కంపోస్టుగా మార్చి, ఇతర చెత్తను ఎప్పటికప్పుడూ క్లీన్ చేసే విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిలో రీసైక్లింగ్ చేసేందుకు రెండెకరాల స్థలంలో ప్రత్యేకంగా ప్లాంట్ ఏర్పాటు చేశారు. అలాగే, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లోని చెత్త గుట్టలను బయోమైనింగ్ పద్ధతిలో క్లీన్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తపల్లిలో 405 మెట్రిక్ టన్నులు, చొప్పదండిలో 493 మెట్రిక్ టన్నులు, హుజూరాబాద్‌లో 4200 మెట్రిక్ టన్నులు, జమ్మికుంటలో 6120 మెట్రిక్ టన్నుల చెత్తను క్లీన్ చేసేందుకు ఇప్పటికే అన్నపూర్ణ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.
సంబంధిత కాంట్రాక్టర్ పనులు త్వరగా పూర్తి చేసేలా ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు చర్యలు తీసుకుంటున్నారు. బయోమైనింగ్ పనులను అధికారులు పర్యవేక్షణ చేయడంతో పాటు వివరాలను ఎప్పటికప్పుడూ పంపించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ఆయా మున్సిపాలిటీలకు ఆదేశాలు ఇచ్చింది. డంప్ యార్డుల్లోని చెత్త క్లీనింగ్ పూర్తయిన తర్వాత మరోసారి చెత్త గుట్టలు పేరుకుపోకుండా ప్రతి రోజూ వచ్చే చెత్తను ఎప్పటికప్పుడూ రీసైక్లింగ్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆయా కమిషనర్లకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు వీటికి సంబంధించి ఆయా మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే పట్టణాల్లో చెత్త సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది.