కార్పొరేషన్, ఏప్రిల్ 5: నగర అభివృద్ధి కోసం అత్యధికంగా నిధులు మంజూరు చేయించి, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 28వ డివిజన్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ వై సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నగరాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చూపించారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వందల కోట్లతో నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను కూడా సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో నగరంగా కరీంనగర్ మారబోతుందన్నారు. ఇందుకోసమే నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అత్యధిక నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు రోజూ మంచినీటి సరఫరా అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 24 గంటలు మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు. నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. జడ్పీ చైర్పర్సన్ విజయ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్ నాంపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.