గంగాధర, ఏప్రిల్ 5: రాష్ట్రంలోని దళితులందరూ ధనవంతులు కావాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆకాంక్షించారు. చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి మండలం కోనేరుపల్లి, రామడుగు మండలం పందికుంట, గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామాల దళిత బంధు లబ్ధిదారులతో మంగళవారం ఆయన బూర్గుపల్లిలో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దళిత బంధు కోసం ఎలాంటి పైరవీలు లేవని, అధికారులు స్వయంగా వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారన్నారు. దళిత బంధు ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని పేర్కొన్నారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారన్నారు. వచ్చే మూడేళ్లలో ప్రతి దళిత కుటుంబానికీ దళిత బంధు ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, దళిత బంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.