మానకొండూర్, ఏప్రిల్ 4: తెలంగాణలో యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు రైతుల పక్షాన పోరాడుతామని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలో చేపట్టిన రైతు నిరసన దీక్షకు సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, కాలిపోయిన మోటర్ల బాధలు, రైతులకు తీరని కష్టాలు ఉండేవని తెలిపారు.
తెలంగాణ ఏర్పడ్డాక రైతుల కష్టాలు తీరాయన్నారు. 24 గంటల కరెంట్, రైతుబీమా, రైతుబంధు, తదితర సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు రైతులు పంటమార్పిడిపై ఆసక్తి కనబరిస్తే, వరి పంటే వేయాలని ప్రతి ధాన్యం గింజనూ కేంద్రం నుంచి కొనుగోలు చేపిస్తానని ప్రగల్భాలు పలికిన బండి సంజయ్‌ను రైతులు నిలదీయాలన్నారు. రైతుల కన్నీళ్ల మీద రాజకీయాలు చేస్తున్న బీజీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ తెలంగాణలో ఏవిధంగానైతే నామరూపాలు లేకుండా పోయిందో ఇప్పుడు వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో బీజేపీకి కూడా అదేగతి పడుతుందన్నారు.
సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి పట్టిన శనిగ్రహాలని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా రైతులు ఇండ్లపై నల్లజెండాలను ఉంచి నిరసన తెలుపాలని సూచించారు. టీఅర్ఎస్ మండలాధ్యక్షుడు, జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్‌రెడ్డి, మానకొండూర్ సింగిల్ విండో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, వైస్ చైర్మన్ పంజాల శ్రీనివాస్‌గౌడ్, గంగిపల్లి సహకార సంఘం అధ్యక్షుడు పారిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, ఆరెపల్లి రాజేందర్, వాల ప్రదీప్‌రావు, పడాల సతీశ్‌గౌడ్, దేవ సతీశ్‌రెడ్డి, మాడ తిరుపతిరెడ్డి, అడప శ్రీనివాస్, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, దండు మనోజ్, పారునంది కిషన్, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కోండ్ర నిర్మల, అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో నిరసన దీక్ష
చిగురుమామిడి, ఏప్రిల్ 4: మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు వరి సాగు చేస్తే కేంద్రంతో కొనుగోలు చేయిస్తామన్న బీజేపీ నాయకులు ఇప్పుడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. రైతులను మోసం చేస్తున్న కేంద్రం తీరుపై గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో తిరుగుబాటు చేస్తామన్నారు. ఎస్ఐ దాస సుధాకర్ వచ్చి రాస్తారోకో విరమింపజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, సింగిల్‌విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు అందె సుజాత, ఆర్బీఎస్ జిల్లా నాయకుడు సాంబారి కొమురయ్య, సింగిల్‌విండో మాజీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, పార్టీ అనుబంధ కమిటీల నాయకులు, గ్రామాధ్యక్షులు, రైతు కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ధాన్యం కొనాల్సిందే
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 4: మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వరి పంటలు కోతకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం ధాన్యం కొనాల్సిందేనని స్పష్టం చేశారు. దీక్షలో ఎంపీపీ కేతిరెడ్డి వనితాదేవేందర్రెడ్డి, జడ్పీటీసీ ఇనుకొండ శైలజాజితేందర్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనితాఆంజనేయులు, పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, ఆర్బీఎస్ సభ్యులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
గన్నేరువరంలో
గన్నేరువరం, ఏప్రిల్ 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనబోమని చెబుతూ తెలంగాణ రైతులను దగా చేస్తున్నదని జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి ఆరోపించారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్, రైతు బందు సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్రం దిగి వచ్చి బేషరతుగా వడ్లు కొంటామనేదాకా రైతు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, వైస్ ఎంపీపీ న్యాత స్వప్నా సుధాకర్, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు తీగల మోహన్‌రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కుసుంబ నవీన, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బూర వెంకటేశ్వర్లు, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు, గ్రామశాఖల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.