కరీంనగర్ రూరల్/కొత్తపల్లి, ఏప్రిల్ 4:రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనేది లేదంటూ మొండికేసిన కేంద్రం మెడలు వంచేందుకు టీఆర్ఎస్ యుద్ధ భేరి మోగించింది. విజ్ఞప్తులు, విన్నపాలు చేసినా వినకపోవడంతో ప్రత్యక్ష పోరాటానికి నడుం కట్టింది. ఐదు రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలన్న అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మొదటి రోజైన సోమవారం అన్ని మండలాల్లో నిరసన దీక్షలు చేపట్టింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు రైతాంగం వెంట కదిలింది. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని దుర్శేడ్, కమాన్‌పూర్ పరిధిలోని ఒడ్డెపల్లిలో మంత్రి గంగుల కమలాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, హుజూరాబాద్, ఇల్లందకుంటలో జడ్పీ చైర్ పర్సన్ విజయ, మానకొండూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జీవీఆర్, గంగాధరలో సుంకె రవిశంకర్, సైదాపూర్‌లో ఎమ్మెల్యే సతీశ్‌బాబు పాల్గొన్నారు. కేంద్రం ధాన్యం కొనే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.
యాసంగి వడ్లు కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతుపై తీవ్ర వివక్ష చూపుతున్న కేంద్రం మెడలు వంచుతామని, ప్రతి గింజా కొనుగోలు చేసేలా చూస్తామని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ర్టాలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదేనని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, తామేం బిచ్చం అడగడం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ మండలం దుర్శేడ్, కొత్తపల్లి మండలం కమాన్‌పూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెపల్లి వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షల్లో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. గోపాల్పూర్ క్రాసింగ్ వద్ద బండి ఎక్కి వడ్లు తూర్పార పట్టి నిరసన తెలిపారు.
రాజకీయాల కోసం రోడ్డు ఎక్కలేదని, ఇప్పట్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎన్నికలు లేవని, కేవలం తెలంగాణ రైతన్నపై కేంద్రం తీరుపై నిరసనగానే పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. 1965 నుంచి ఎఫ్‌సీఐ వానకాలంలో రా రైస్, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొంటున్నదని, ఈ సంవత్సరం కొత్త నిబంధనలు పెట్టి కేంద్రం తెలంగాణ రైతులపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఎప్పటిలాగే యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కొత్త నిబంధనలు పెట్టి రైతులపై షరతులు విధించవద్దని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దనే వ్యవసాయ చట్టాలు ఉన్నాయని, ఎమ్మెస్పీ చేసే బాధ్యత కూడా కేంద్రానిదేనని, తాము రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ద్వారా వచ్చే హక్కు ప్రకారంగానే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆందోళన చేస్తామని, మెడలు వంచి వడ్లు కొనుగోలు చేయిస్తామన్నారు. ఈ నెల 7న జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయిలో ఆందోళన చేస్తామని, 8న ప్రతి రైతు ఇంటి పైన నల్ల జెండాలు ఎగురవేస్తామని, అప్పటికీ దిగిరాకపోతే 11న ఢిల్లీ వేదికగా ఉద్యమిస్తామని వివరించారు. ధాన్యం కొనుగోలు చేసే వరకూ విడిచిపెట్టే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
బండి ఇంటి ముందు ధాన్యం పోస్తాం
ధాన్యం కొనాలని కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ వద్దకు వెళ్తే తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయించాలని అవమానించాడని, ఆయనకు ఎంత అహంకారమని మండిపడ్డారు. దీనిపై బండి సంజయ్ నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. బండికి నిజంగా రైతుపై ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇక్కడ పండించిన రైతుల ధాన్యాన్ని సంజయ్ ఇంటి ముందు పోసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కేంద్రం కుట్రను ముందుగానే గుర్తించి యాసంగిలో వరి వేయద్దని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబితే.. బండి మాత్రం కేంద్రం కొంటుందని, వరి వేసుకోవచ్చని నమ్మించి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని మండిపడ్డారు.
ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. వడ్ల కొనుగోళ్లలో బీజేపీ సర్కారు నిర్లక్ష్యం చూపితే మున్ముందు భారీ మూల్యం చెల్లించకతప్పదన్నారు. రైతుల ఆందోళనలకు కేంద్రం దిగిరాకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇక్కడ కరీంనగర్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్, కరీంనగర్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ ఆనందరావు, జడ్పీటీసీ పురుమల్ల లలిత, ఆర్బీఎస్ మండల కన్వీనర్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, సర్పంచ్ మంజుల, ఊరడి మాల్లారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, సర్వర్ పాషా, సుంకిశాల సంపత్‌రావు, ఎర్రం రమేశ్, మంద రాజమల్లు, రాజయ్య, రాజిరెడ్డి, నర్సయ్య, నరేశ్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, బుచ్చాల కొమురయ్య, ర్యాకం మోహన్, సాయిల వినయ్‌సాగర్, అంకమల్ల శ్రీనివాస్, తోట తిరుపతి, అత్మ చైర్మన్ ఆరె శ్రీనివాస్, అంజిరెడ్డి, ఆరె శ్రీకాంత్, భూమయ్య, కొమురయ్య, గాండ్ల అంజయ్య, రాజయ్య ఉన్నా రు. కొత్తపల్లి మండల సర్పంచులు జినుక సంప త్, రాచమల్ల మధు, ఎల్దండి షర్మిల, ఉల్లెంగుల రాజమ్మ, కడారి శాంత, గొట్టె జ్యోతి, ఎంపీటీసీలు భూక్యా తిరుపతినాయక్, పట్టెం శారద, పండుగ గంగవ్వ, దావ కమల-మనోహర్, ఆర్బీఎస్ అధ్యక్షుడు శంకర్‌గౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ సాబీర్, కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్ ఉన్నారు.
కేంద్రం రైతులకు భరోసా కల్పించాలి
కరీంనగర్ రూరల్: వడ్లు కొంటామని కేంద్రం రైతులకు భరోసా ఇయ్యాలె. వడ్ల కొనుగోళ్లపై కేంద్రం బాధ్యతగా ఉండాలె. లేకుంటే కేంద్ర ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోతుంది. వడ్లు కొనకుంటే రైతు ఉద్యమాలను ప్రోత్సహించినట్లే. రైతు ఉద్యమాలతో దేశానికి తీరని నష్టం కలుగుతుంది.
– సాయిని నర్సయ్య, గోపాల్పూర్
కేంద్రం మెడలు వంచైనా కొనిపించాలె
కరీంనగర్ రూరల్: యా సంగి వడ్ల కొనుగోళ్లపై కేం ద్రం దిగొచ్చేదాకా పార్టీలకతీ తంగా ఉద్యమించాలె. తెలంగా ణ సర్కార్ రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటే కేంద్రం నడ్డి విరిచేలా చేస్తున్నది. సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించినట్లే.. కేంద్రం మెడలు వంచైనా యాసంగి వడ్లను కొనిపించాలె.
– గోనె ఎల్లయ్య, గోపాల్పూర్
సంజయ్ ఇంటిముందు వడ్లు పోస్తం
కరీంనగర్ రూరల్: మరో 20 రోజుల్లో వరి కోతలు మొ దలైతయ్. రైతుల చేతికి వడ్లు వస్తయ్. ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రులను సంప్రదిం చి యాసంగి వడ్లను కొనుగోలు చేసేందుకు కృషి చేయాలె. లేని పక్షంలో రైతులు పండించిన వడ్ల ను బండి ఇంటి ముందు పోసి నిరసన తెలుపుతం.
– మంద రాజమల్లు, విండో మాజీ చైర్మన్, గోపాల్పూర్