వేములవాడ, ఏప్రిల్ 4: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దిన వైటీడీఏ (యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) బృందం సోమవారం రాజన్న క్షేత్రాన్ని సందర్శించింది. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, వీటీడీఏ(వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి ప్రధాన ఆలయాన్ని పరిశీలించి ఈవో రమాదేవితో మాట్లాడారు. ఇక యాదాద్రి ఆర్కిటెక్చర్ ఆనంద్‌సాయి మరో ఆర్కిటెక్చర్ ముక్తీశ్వర్తో కలిసి వేములవాడ రాజన్నఆలయంతో పా టు అనుబంధ ఆలయాలను సుమారు 3 గం టల పాటు కలియదిరిగి పరిశీలించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్, ప్రధాన అర్చకుడు శరత్‌తో మాట్లాడి ఆలయ విశిష్టతను, ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు. త్వరలో సీఎం కేసీఆర్ వేములవాడకు రానున్నారని తెలుస్తుండగా పూర్తిస్థాయి అభివృద్ధి ప్రణాళికలు చేసేందుకు బృందం రాజన్న క్షేత్రాన్ని సందర్శించినట్లు తెలుస్తున్నది.
చాళుక్యులు, కాకతీయులు కళా వైభవం ఉట్టిపడేలా వేములవాడ ప్రాంతాన్ని ఏలిన చాళుక్యులతో పా టు కాకతీయ వైభవం ఉట్టిపడేలా అభివృద్ధి నమునాలను రూపొందిస్తామని యాదాద్రి అర్కిటెక్చర్ ఆనంద్‌సాయి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. భక్తులకు సౌకర్యాలతో పాటు ఆలయ విశిష్టతను పెంపొందించే విధంగా నమునాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 15 రోజుల్లోగా ప్లాన్ తయారుచేసి ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. మరోసారి సీఎంతో కలిసి ఆలయాన్ని సందర్శిస్తామని వెల్లడించారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో దేశంలో ఉత్తరాదిన ఉన్న శిల్ప సౌం దర్యం ఇక్కడ నగరేశ్వర ఆలయంలో ఉన్నదని అభిప్రాయపడ్డారు. వారి వెంట ఆలయ ఈఈ రాజేశ్, డీఈలు రఘునందన్, లక్ష్మణ్‌రావు, ఏఈవోలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, ప్ర తాప నవీన్, పర్యవేక్షకులు వరి నర్సయ్య, పీఆర్వో చంద్రశేఖర్, ఏఈ శేఖర్, సిబ్బంది ఉన్నారు.
కొండగట్టులో..
మల్యాల, ఏప్రిల్ 4: కొండగట్టు అంజన్న ఆలయాన్ని యాదాద్రి ఆర్కిటెక్చర్ ఆనందసాయి, కొండగట్టు ఆలయ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించిన ముక్తీశ్వర్తో కలిసి సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ను పరిశీలించారు. మాస్టర్‌ప్లాన్‌తో పాటు, డిజైన్‌లో పలు మార్పులు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆలయ పరిసరాలను డ్రోన్ కెమెరా సాయంతో ఫొటోలు తీయించారు. అనంతరం ఆలయ అనువంశిక అర్చకులతో మాట్లాడి ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకున్నారు. స్వామివారిని దర్శించుకొని పూ జలు చేశారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయశాఖ ఈఈ రాజేశ్వర్, డీఈఈ రఘునందన్, ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, పాలకమండలి చైర్మన్ మారుతీస్వామి, జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్‌రావు, సర్పంచ్ తిరుపతిరెడ్డి, నాయకులు మిట్టపల్లి సుదర్శన్, ముత్యాల రాంలింగారెడ్డి, ఆలయ ధర్మకర్తలు జితేంద్రప్రసాద్,ప్రవీన్, జున్ను సురేందర్ పాల్గొన్నారు.