కరీంనగర్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు మంగళవారం గూడ్స్ వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పథకంపై క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు మంగళవారం అంబేదర్ స్టేడియంలో దాదాపు 300 గూడ్స్ వాహనాలను మంత్రి చేతుల మీదుగా అందజేయాలన్నారు. అలాగే కరీంనగర్ నియోజకవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను అందజేయాలన్నారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలన్నారు. క్లస్టర్ వారీగా ఎంతమంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమైందో సోమవారం సాయంత్రంలోగా నిర్ధారించుకోవాలన్నారు. డెయిరీ, ట్రాన్స్‌పోర్టు, ఇతర రంగాలకు చెందిన యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు క్లస్టర్ వారీగా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, లక్ష్మణ్‌కుమార్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.