విద్యానగర్, ఏప్రిల్ 4: వైద్యులు మానవీయ కోణంలో సేవలందించి ప్రభుత్వ దవాఖానలపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వ దవాఖానలోని చిల్డ్రన్స్ వార్డు, కొవిడ్ వార్డు, ధోబీ, లాండ్రి, ధర్మశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం అవుట్ పేషెంట్, ఎస్‌ఎంసీయూ బ్లాక్‌ను సందర్శించారు. వార్డులో జాయిన్ అయ్యే పిల్లల వివరాలను ప్రతిరోజు పంపించాలని డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఆదేశించారు. సాధారణ ప్రసవాల వార్డును పరిశీలించారు. రోగులతో మాట్లాడి సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యాధికారులతో సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రసవాల కోసం వచ్చే వారికి వైద్యులు మానవీయ కోణంతో సేవలందించాలన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, లేబర్ రూమ్‌లో పిల్లల వైద్యుడిని అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జువేరియా, మాతా శిశు సంరక్షణ కేంద్రం దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, డాక్టర్ అలీమ్ తదితరులు పాల్గొన్నారు.