రాజన్న సిరిసిల్ల, మార్చి 29 (నమసే తెలంగాణ): ‘కొందరూ ఆరోగ్యంగానే కనిపించినా అంతర్గతంగా వ్యాధులతో బాధపడుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన జబ్బులు కనిపిస్తుంటాయి.. షుగర్, బీపీ లాంటివి ఉన్నా కొందరికి విషయం తెలియదు. నీళ్లల్లో ఫ్లోరైడ్ ఉన్న ఏరియాల్లో ఎముకలు పెలుసుబారిపోవడం, నడుము వంకర్లు పోవడం, కిడ్నీలు దెబ్బతినడం లాంటివి సంభవిస్తుంటాయి. అల్సర్‌ను నిర్లక్ష్యం చేయడంవల్ల క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం హెల్త్ప్రొఫైల్కు రూపకల్పన చేసింది. మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్నసిరిసిల్ల జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఒక్కో జిల్లాకు రూ. 20 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది’ అని హెల్త్ ప్రొఫైల్ స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చతుర్వేదుల శ్రీధర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుతీరుపై ‘నమస్తేతెలంగాణ’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక్కడ సక్సెస్ అయితే అన్నిజిల్లాల్లో చేపడుతామని చెప్పారు.
నమస్తే : హెల్త్ ప్రొఫైల్ లక్ష్యమేంటి..?
శ్రీధర్: ప్రమాదాల్లో గాయపడ్డ, హఠాత్తుగా అనారోగ్యం పాలైన వారిని దవాఖానలో చేర్చి మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుంది. ఈ సమయంలో బ్లడ్ గ్రూప్, బీపీ, షుగర్ లాంటి పరీక్షలు చేయాలంటే రిస్క్‌తో కూడుకున్న పని. కానీ ఒక్కసారి హెల్త్ప్రొఫైల్లో ఆరోగ్య వివరాలు నిక్షిప్తం చేస్తే బాధితులకు తక్షణమే మెరుగైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడవచ్చు. దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అక్కడి దవాఖానలో చికిత్స అందించడం సులభంగా ఉంటుంది.
ఎన్నిరకాల పరీక్షలు చేస్తారు.?
ప్రతి ఒక్కరి నుంచి 400 ఎంఎల్ రక్తం సేకరించి (కంప్లీట్ బ్లడ్ పిక్చర్)తో పాటు 30 రకాల పరీక్షలు చేస్తాం. ముఖ్యంగా షుగర్, థైరాయిడ్, ఊపిరితిత్తులు, కొలెస్ట్రాల్, క్రియాటిన్ లాంటి అనేక పరీక్షలు చేస్తున్నాం. రక్తం సేకరించిన వ్యక్తి చేస్తున్న పనులు, అతడి అలవాట్లు, వారి కుటుంబంలో అనువంశికంగా వస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల వివరాలను సేకరిస్తున్నాం. పరీక్షల్లో వచ్చిన రిపోర్టు ఆధారంగా మనిషి రిస్క్, నాన్రిస్క్లో ఉన్నాడో తెలుస్తుంది. చికిత్సపై అవగాహన కల్పిస్తాం.
రోజుకు ఎన్ని రక్త నమూనాలు సేకరిస్తున్నారు .?
జిల్లాలో 18 సంవత్సరాల పైబడిన వారు 4,22,812 మంది ఉన్నారు. వీరి నుంచి రక్త నమూనాలు సేకరించేందుకు 250 బృందాలను నియమించాం. ఒక్కో బృందంలో ఏఎన్ఎం, ఇద్దరు ఆశ కార్యకర్తలు ఉంటారు. వీరు ఇంటింటికీ వెళ్లి రోజుకు 7 వేల వరకు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 18ఏళ్ల పైబడిన వారందరి ఎత్తు, బరువు కొలిచి, రక్తం తీసుకుంటారు.
శాంపిల్స్ తారుమారయ్యే అవకాశం ఉన్నదా ?
లేదు.. రక్తం సేకరించే ట్యూబ్‌లకు బార్కోడ్ పెట్టాం. వ్యక్తి రక్తం తీసుకున్నప్పుడు బార్‌కోడ్‌ను కంప్యూటర్లో నమోదు చేస్తారు. సేకరించిన రక్తం ట్యూబ్‌ను స్కాన్ చేయగానే వ్యక్తి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వస్తుంది. సేకరించిన రక్త నమూనాల సంఖ్య, ఫైల్ నంబర్ కంప్యూటర్ ద్వారా సదరు వ్యక్తి ఫోన్‌కు మెస్సేజ్ వెంటనే చేరుతుంది. సేకరించిన రక్తాన్ని ప్రత్యేక వాహనాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్‌కు తరలిస్తాం. రెడ్‌ట్యూబ్, లావెంటర్లో తీసుకున్న రక్త నమూనాల ద్వారా స్క్రీనింగ్ చేస్తారు.
ప్రజల సహకారం ఏవిధంగా ఉన్నది.
మొదట చాలా మంది పరీక్షలు అనగానే భయపడేవారు. నేను బాగానే ఉన్నాను.. నాకెందుకు పరీక్షలంటూ ప్రశ్నించేవారు. హెల్త్ ప్రొఫైల్ గురించి క్లుప్తంగా వివరించాం. ఇప్పు డు వారిలో చైతన్యం పెరిగింది. స్వతాహాగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామానికి ఏరోజు వైద్యబృందం వస్తున్నదో ముందుగానే సమాచారం ఇస్తున్నాం. వ్యవసాయ, ఇతరత్రా పనులకు వెళ్లే వారు పనులు మానుకొని మరీ రక్త నమూనాలు ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం.
ఈ పరీక్షలకు బయట చేస్తే ఎంత ఖర్చవుతుంది .?
30 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తున్నాం. బయటి డయాగ్నోస్టిక్ సెంటర్లలో చేస్తే దాదాపు రూ. 5 వేల నుంచి రూ. 6వేల వరకు ఖర్చవుతుంది. అది కూడా నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. స్క్రీనింగ్ టెస్ట్‌లు, రక్త నమూనాల ప్రాసెసింగ్ కోసం సిరిసిల్లలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేరిట ప్రభుత్వం అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడు ఎన్ని జిల్లాల్లో ఈ ప్రోగ్రాం కొనసాగుతున్నది?
రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశాం. సిరిసిల్లలో ఎక్కువ శాతం బీడీ, మరమగ్గాల కార్మికులున్నారు. ఇక్కడ హెల్త్ ప్రొఫైల్ విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడి అనుభవాలను బట్టి తర్వాత అన్ని జిల్లాల్లో చేపడుతాం. పరీక్షలు చేసుకున్న వారందరికీ డిజిటల్ కార్డులు జారీ చేస్తాం.