జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్
ఎస్సారార్లో అలరించిన ఉగాది కవితా సంకలనం
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 3: కవులు, కళాకారులకు కరీంనగర్ జిల్లా నిలయమని జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. భవాని సాహిత్య వేదిక కరీంనగర్, స్థానిక ఎస్సారార్ కళాశాల తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శుభకృత్ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శుభకృత్ ఉగాది కవితా సంకలనాన్ని అదనపు కలెక్టర్ ఆవిషరించి, మాట్లాడుడారు. సమకాలీన సమస్యలపై కవితాస్త్రాల్ని సంధించిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణ మాట్లాడుతూ.. సహజత్వంతో సమకాలీన సమస్యలను వస్తువులుగా ఎంపిక చేసుకొని కవిత్వాన్ని మలిచే ప్రతిభావంతులకు జిల్లాలో కొదవ లేదన్నారు. భవాని సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వైరాగ్యం ప్రభాకర్ మాట్లాడుతూ.. వస్తు వైవిధ్యంతో రాసిన కవితలను సమాజానికి దిశా నిర్దేశం చేసే దిశగా ఎంపిక చేసి ప్రచురించామన్నారు. తెలుగు విభాగం అధిపతి డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఉగాది కవి సమ్మేళనంలో విద్యార్థులు పాలుపంచుకోవడం యువతకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా కవులకు ప్రశంసా పత్రాలు అందజేసి, శాలువాలతో సతరించారు. కవితా సంకలనం పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో నూజెట్టి రవీంద్రనాథ్, విలాసాగరం రవీందర్, నీలగిరి అనిత, పత్తెం వసంత, అనంతోజు పద్మశ్రీ, హిమ రాణి, వాణిశ్రీ, ప్రేమసాగర్ రావు, వెంకటరమణ, విజయలక్ష్మి, నాగరాజ్, రమణయ్య, డాక్టర్ చైతన్య, డాక్టర్ అనిల్, విజయశ్రీ, సీమ, పవన్, భరత్, భిక్షపతి, కవులు పాల్గొన్నారు.