కమాన్చౌరస్తా, ఏప్రిల్ 1: నేడు తెలుగు సంవత్సరాది ఉగాది. వసంతాగమన శుభవేళ, పచ్చదనం సింగారించుకుని కళకళలాడే ప్రకృతి సాక్షిగా, ‘చిత్త’ నక్షత్ర ప్రవేశంతో చైత్రశుద్ధ పాఢ్యమి రోజున వచ్చే పండుగిది. ఇక ప్లవ నామ సంవత్సరం గతం, నేటి నుంచి శ్రీ శుభకృత్ సంవత్సరం ప్రారంభం. ప్రమాదాలు, ప్రమోదాల కలబోతగా గడిచిన ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, రాబోయే సంవత్సరమైనా తమ జీవితాల్లో నవ్య కాంతుల్ని నింపుతుందనే ఆశతో మరో వసంతాన్ని స్వాగతించడమే ఉగాది పరమార్థం. వసంత రుతువు ఆగమనంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. వసంతం తర్వాత గ్రీష్మ, వర్ష, శరదృతువు వస్తుంది. ఆ తర్వాత ‘హేమంతం’, చివరగా ‘శిశిరం’ వచ్చి పడుతుంది.
రెండేసి నెలలతో ఒక్కో రుతువు ఉంటుంది. ఆరు రుతువులతో ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఈ రుతువులన్నింటిలోనూ వసంతం ప్రత్యేకంగా నిలుస్తుంది. చైత్రం, వైశాఖం రెండు మాసాలు కలిపి వచ్చే ఈ రుతువు, ఆకురాల్చే శిశిరం తర్వాత ప్రకృతికి కొత్త చిగురులు తొడుగుతుంది. రెండు నెలలపాటు పరవశిస్తుంది. కొత్త కొత్త అందాలు సంతరించుకుని ఆహ్లాదకర వాతావరణంతో మోహం కలిగిస్తుంది. పచ్చని రమణీయతను, సౌందర్య కమనీయతను తెచ్చే ఆమని, భానుడి తేజస్సును తెస్తుంది. చెట్లన్నీ చిగురిస్తాయి. మొక్కలన్నీ పూలతో విరబూస్తాయి. లేలేత చిగుర్లపై కుహు కుహూ రాగాలతో కోయిలమ్మలు వీనులవిందు చేస్తాయి. చైత్రమాసం ఆరంభంతోనే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి, ఎండ తీవ్రత మొదలవుతుంది. రాత్రి తగ్గి, పగలు సమయం పెరుగుతుంది. మెల్లిగా గ్రీష్మ రుతువు ఆరంభంవైపు పయనమవుతుంది. ఇదంతా ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం మార్చి 18 నుంచి మే 18 మధ్యలో కనిపిస్తుంది.
షడ్రుచుల సమ్మేళనం..
ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి (బెల్లం), పులుపు (చింతపండు), కారం, ఉప్పు, వగరు (మామిడి కాయ), చేదు (వేప పువ్వు)తో ఇది తయారవుతుంది. ఈ పచ్చడి ఆరోగ్యానికి సంజీవనిలా పని చేస్తుంది. బెల్లం రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దానివల్ల అదనంగా శక్తి చేకూరుతుంది. ఇది శాస్త్రీయంగానే కాకుండా జీవిత సత్యాలకు అర్థం చెప్పేదిగా కనిపిస్తుంది. పచ్చడిలో వినియోగించే బెల్లం మని షి ఆనందానికి, ఉప్పు ఉత్సాహానికి, వేప పువ్వు బాధకు, పులుపు నేర్పుకు, మామిడి వగరు కొత్త సవాళ్ల స్వీకారానికి, కారం సహనం కోల్పోయే పరిస్థితులకు సూచికగా పేర్కొంటారు. ఎలాగైతే రుచులను స్వీకరిస్తామో, జీవితంలో సైతం గెలుపోటములను, కొత్త సవాళ్లను, బాధలను ఓర్చుకోవాలనే సత్యం అంతర్గతంగా కనిపిస్తుంది. జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనం లాంటిదన్న వేదాంత సారాన్ని మనకు తెలియజేస్తుంది.
కష్టసుఖాల కలబోత..
వసంత రుతువును తరిచి చూస్తే జీవిత సత్యం కనిపిస్తుంది. శిశిరంలో ఆకురాల్చి మోడు వాడిన తరువులకు, వసంతం కొత్త చివుళ్లను ఇచ్చి ప్రకృతి కాంతకు కొత్త కాంతులను ఇస్తుంది. జీవులు ఆహ్లా దం చెందుతాయి. పూబాలలు విరబూస్తాయి. ఇక గ్రీష్మం ప్రవేశించగానే అందమైన ఆమని మాయమవుతుంది. మండే ఎండలతో వసంతం తేలిపోతుంది. ఆ తర్వాత వర్షరుతువుతో ప్రకృతికి కొత్త శోభ వస్తుంది. వీటన్నింటిని లోతుగా చూస్తే ‘కష్టాలు కలకాలం ఉండవు. మంచి రోజులు మళ్లీ వస్తాయి’ అనే నమ్మకం కలుగుతుంది. ప్రకృతి అంటే ఆరు రుతువుల సమ్మేళనం. ఆ ఆరు రుతువుల్లో మార్పులను ఎలా స్వీకరిస్తామో, తమ జీవితాల్లో కష్టసుఖాలను అలానే ఆచరించాలి.
కోయిలమ్మ రాగాలు..
కోకిలకు వసంత రుతువుతో విడదీయలేని అనుబంధం ఉన్నది. మావి చివుళ్లను తిని, కూజీతాలు తీసే కోయిలమ్మలు ఆ కమ్మని రాగాలను వినిపిస్తాయి. సృష్టి ప్రకారం ఆకులు చిగురించే వసంతంలోనే ఆడ, మగ కోకిలలు జత కూడుతాయి. ఆడ వాటిని ఆకర్శించేందుకే మగవి చేసేవే కుహు కుహూ రాగాలు. కోకిలలు గూళ్లు అల్లుకో వు. కాకుల గూళ్లను అన్వేషించి అందులో ఒకటి, రెండు గుడ్లను పెడుతాయి. కాకి పెట్టిన ఒకటి రెండు గుడ్లను తోసివేసి, తన గుడ్లను అందులో ఉంచుతాయి. కాకే కోయిల గుడ్లను పొదుగుతుంది. 12నుంచి 14 రోజుల తర్వాత కోకిల పిల్ల లు గుడ్ల నుంచి బయటికి వస్తాయి. అప్పుడు వా టి అరుపులు సైతం కాకుల్లాగే ఉండడంతో కాకులు సైతం వాటిని పెద్దగా పట్టించుకోవు.
కా కులు గూళ్లలో లేని సమయంలో కోకిల వచ్చి తన పిల్లలకు ఆహారం అందజేస్తుంది. కోకిల పిల్లలు పెరిగిన తర్వాత అరుపుల్లో తేడాను గుర్తించి కాకులు, వాటిని తమ గూళ్ల నుంచి తరిమేస్తాయి. అప్పటికే ఇవి పెద్దవి కావడంతో స్వేచ్ఛగా జీవిస్తాయి. కోకిలలు 38 నుంచి 46 సెంటీమీటర్ల పొ డవు వరకు పెరుగుతాయి.180 గ్రాముల బరువు నుంచి 240 గ్రాముల బరువు తూగుతాయి. కోయిలలు ప్రధాన ఆహారంగా పండ్లను, గింజల ను స్వీకరిస్తాయి. జీవవైవిధ్యంలో ఇవి తమ వం తు పాత్ర పోషిస్తాయి. చెట్లు, మొక్కల సంరక్షణకు ఉపయోగపడుతాయి. దేశంలో నల్లని కోయిలకు మంచి గుర్తింపు ఉంది. జార్ఖండ్, పుదుచ్చేరి రాష్ర్టా లు కోయిలను తమ రాష్ట్రపక్షిగా ప్రకటించాయి.
శుభాలు కలిగే సంవత్సరం ఇది..
శుభకృత్ నామ సంవత్సరం అన్ని శుభాలు కలిగిస్తుంది. ఇందులో శుభగృహ ఆధిపత్యం ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడుతాయి. పంటలు బాగా పండి రైతులు, అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ, శ్రావణ మాసం వరకూ అన్నీ మంచి రోజులే ఉన్నాయి.
– మంగళంపల్లి శ్రీనివాస శర్మ, నగర ప్రధాన వైదిక పురోహితుడు (కరీంనగర్)