యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి నడుంబిగించగా, ఉమ్మడి జిల్లా రైతాంగం సై అంటున్నది. మేము సైతం మీ వెంటే అంటూ మద్దతు పలుకుతున్నది. నీళ్లు, కరెంట్, పెట్టుబడి సాయం.. ఇలా తీరొక్కటి ఇచ్చి రాష్ట్ర సర్కారు ఆదుకుంటుంటే.. వడ్లు కొనబోమని నోటికాడి బుక్కను లాక్కుంటున్న కేంద్రంతో ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నది. కొనేదాకా కొట్లాడుడే అని, ఉద్యమాలు చేసైనా మెడలు వంచుతామని స్పష్టం చేస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల మంది రైతులున్నారు. ఈ యాసంగిలో ఏడు లక్షలపై చిలుకు ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందులో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నులు తిండితోపాటు సీడ్స్ కోసం పోను మిగిలిన 13 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం మార్కెట్‌కు రానున్నది. ఈ మొత్తాన్ని కేంద్రం ముందుకొచ్చి కొనాల్సి ఉన్నది. నిజానికి ఈ సారి వరి వేయవద్దంటూ ప్రభుత్వం పదే పదే చెప్పడం వల్ల ఉమ్మడి జిల్లాలో మూడు నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గించి ఇతర పంటలవైపు అడుగులు వేశారు. లేకుంటే దిగుబడి మరో నాలుగైదు లక్షల టన్నులు పెరిగేది. ఉమ్మడి జిల్లాలో నీళ్ల కొరత కూడా లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మొదలుకొని అప్పర్‌మానేరు వరకు జలవనరులన్నీ ఎండకాలంలోనూ నిండుకుండలను తలపిస్తున్నాయి. అయినా ప్రభుత్వ ప్రచారంతో రైతులు ఇతర పంటలవైపు మళ్లారు.
పార్లమెంట్ గేట్ల ముందర అడ్లువోసి ధర్నా జేత్తం.
తెలంగాణల మా రైతులకు గోసలేదు. సీఎం కేసీఆర్ మాకు అన్ని సౌలతులు చేత్తుండు. మనం బాగుపడితే బీజేపోళ్లు ఓర్తలేరు. అందుకే యాసంగి అడ్లు కొంటలేరు. కొనకపోతే ఊకుంటమా.. తెగించి కొట్లాడుడే. దేశంలోని ఏ రాష్ట్రంల కనవడని పథకాలు, అభివృద్ధి జోడెడ్లలాగా జరుగుతుంది. నేను 50 ఏండ్ల సంది ఎవుసం జేత్తున్న. ఇసోంటి నాయకున్ని ఎన్నడూ చూడలే. ఏ కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను గింత గోసవుచ్చుకోలేదు. నరేంద్ర మోదీకి ఇంత పక్షపాతం పనికిరాదు. పక్క రాష్ర్టాలల్ల రెండు పసల్ల అడ్లు కొంటరట.. మా దగ్గర కొనరట. అంటే యాసంగిల తెలంగాణ రైతులు పస్తులుండాల్నా..? పండించిన పంటను రోడ్ల మీద పారబొయ్యాల్నా..? ఆయనే జెప్పాలె. పోయిన యాసంగి నుంచెల్లి అరిగోసవెడ్తర్రు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కేసీఆర్ కాళ్లరిగేటట్లు ఢిల్లీకి తిరిగినా పట్టించుకోలె. గంతగానం గర్వమా..? రాజకీయాలు ఏవన్నుంటే ఎన్నికలల్ల సూసుకోవాలే. అంతేగాని మా రైతులను గోసవెడ్తే ఏమత్తది. ప్రభుత్వం కొంటదని నమ్మి నేను పదెకురాలల్ల దొడ్డురకం పంట ఏసిన. నా బతుకు ఏంగావాలే. రైతులను గోస వెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపల్లె. ఇగనన్న దొడ్డు అడ్లను కొంటమని, రైతులకు అండగా ఉంటమని కేంద్ర ప్రభుత్వం ఎంటనే చెప్పాలె. లేకుంటే కోసిన పంటను ఇక్కడ గాదు ఢిల్లీలో పార్లమెంట్ గేట్ల ముందట పోసి ధర్నా జేత్తం.
– కట్కూరి మధుసూదన్‌రెడ్డి, రైతు, ఘన్ముక్ల (వీణవంక మండలం)
మీ వెంటే మేం : రైతన్న
లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కల్పించడంతోపాటు వారి బతుకులకు భరోసా ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే నిర్మాణం చేశారు. అంతేకాదు. ఆ జలాలను ఇప్పుడు ఎత్తిపోస్తూ. హైదరాబాద్ వరకు తీసుకెళ్లారు. మిగిలిన జిల్లాల్లోనూ ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయి. కాళేశ్వరం జలాల రాకతో ఉమ్మడి జిల్లాలో కరువు దూరమైంది. సమైక్య రాష్ట్రంలో నెర్రలు బారిన నేలలు ప్రస్తుతం పచ్చని పొలాలతో కళకళలాడుతున్నాయి. ఫలితంగా ధాన్యం దిగుబడులు పదింతలు పెరిగాయి. కేంద్రం కొర్రీలు పెడితే ఎక్కువగా నష్టపోయేది ఉమ్మడి జిల్లా రైతులే. ఈ నేపథ్యంలో కేంద్రంపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైందంటున్నారు రైతులు. కొనాల్సిన కేంద్రం చేతులేత్తేస్తే తాము పండించిన ధాన్యం ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, కేంద్రం, బీజేపీ నాయకులు ఈ విషయంలో ఝూటా మాటలు చెబుతున్నారని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం పంజాబ్‌పై ప్రేమ కురిపిస్తున్నదని, తెలంగాణపై మాత్రం వివక్ష చూపుతున్నదని ధ్వజమెత్తారు. పంజాబ్ తరహాలో ఇక్కడ ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యమంలో తాము భాగస్వామమవుతామని, ఢిల్లీపై దండయాత్రకు కేసీఆర్ వెంట ఉండి.. పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి కొనుగోళ్లు చేయకపోతే, బీజేపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
రైతన్న కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచిన ముఖ్యమంత్రి
కేంద్రం కొర్రీలు
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కొన్నాళ్లుగా కొర్రీలు పెడుతున్నది. మార్కెట్‌కు ధాన్యం వచ్చిన తర్వాత లేవీ బియ్యం రైస్‌మిల్లుల నుంచి తీసుకోవడం లేదు. దీంతో మిల్లుల్లో నిల్వలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచాల్సి వస్తున్నది. గతేడాది అన్నదాతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ధాన్యం నిల్వల కోసం చివరకు కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్‌ను కూడా వినియోగించింది. రాష్ట్ర సర్కారు రైతుకు అండగా ఉంటున్నా.. కేంద్రం మాత్రం మళ్లీ అదే కొర్రీలు పెడుతున్నది. నిజానికి యాసంగిలో వచ్చే పంటను కొనాలని ఇప్పటికే పలుసార్లు ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. రాష్ట్ర మంత్రులు కూడా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. అయినా. వారి నుంచి స్పందన లేదు. అందుకే.. కేంద్రంపై తాడో పేడో తేల్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలువనున్నది. అప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోతే.. మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది. అన్నదాతల పరిరక్షణ, ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం.. ఏకంగా కేంద్ర సర్కారుపై దండయాత్రకే ముఖ్యమంత్రి నిర్ణయించారు.
తినే అన్నంల మట్టిపోస్తరా..?.
గతంల మా బతుకులు అధ్వానంగా ఉండె. పంటలు పండక, నీళ్లు రాక గోసపడ్డరు. కరెంటు పెట్టేందుకు రాత్రనకా.. పగలనకా.. తిరిగి తిప్పలు వడ్డరు. గిలాంటి కష్టకాలం నుంచి రైతులను సీఎం కేసీఆర్ గట్టెక్కించిండు. నీళ్లు, కరెంటు కష్టాలను అందించి, అనేక పథకాలు పెట్టి వ్యవసాయాన్ని పండుగ చేసిండు. ఇప్పుడిప్పుడే రైతుల బతుకులు బాగుపడుతున్నయి. ఇట్లాంటి టైంలో కేంద్రం యాసంగి వడ్లు కొనబోమని చెప్పడం కరెక్ట్కాదు. తినే అన్నంల మట్టిపోస్తరా..?. గత వానకాలంల కొనకపోతేనే మస్తు ఇబ్బందులు పడ్డరు. ఈ యాసంగిల కూడా అలాగే చేస్తే రైతులను ఎక్కడికిపొమ్మంటరు. కేంద్రం ధాన్యం కొనాల్సిందే. లేదంటే ఊరుకునేది లేదు.
– సంకినేని రాంమ్మోహన్రావు, కొలనూర్ సింగిల్ విండో చైర్మన్ (కోనరావుపేట)
ఉప్పు పుట్నాలకు అమ్ముకోవాలి..
కేంద్రం వడ్లు కొనకపోతే మేం చేసేదేం లేదు. ఉప్పు పుట్నాలకు అమ్ముకునుడు తప్ప. అపుడు వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉంటది పరిస్థితి. మద్దతు ధరకు వడ్లు పోకుంటే రైతులు బిచ్చగాళ్లు అయితరు. అగ్గువ సగ్గువకు వ్యాపారులు అడిగితే పెట్టుబడి కూడా దక్కదు. ఆరుగాలం చేసిన రెక్కల కష్టం అక్కరకు రాకుండా పోతది. రైతుల కోసం కేసీఆర్ తండ్లాట పడుతుంటే బీజేపోళ్లు మాత్రం చిల్లరగా మాట్లాతుండ్రు. ఇది కరెక్ట్ కాదు. బీజేపోళ్లకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే వడ్లు కొంటమని కేంద్ర ప్రభుత్వంతో చెప్పించాలె. అంతేగాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఉరుకోం.
– యాళ్ల వీరారెడ్డి, ఇప్పలనర్సింగాపూర్ (హుజూరాబాద్)
వడ్లు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే
వడ్లు కొనాల్సిన బాధ్యత మూమ్మాటికీ కేంద్రానిదే. ఇక్కడి బీజేపీ నాయకులు గల్లీలో ఓ మాట ఢిల్లీలో మాట మాట్లాడుతున్నారు. వడ్లు కేంద్ర కొంటదని, రైతులు బాధపడవద్దని ఏ రోజైనా చెప్పిన్రా..? రాష్ట్రం ధాన్యాన్ని సేకరించి కేంద్రానికి అప్పజెప్పడం మాత్రమే చేస్తుంది. ఈ విషయం బీజేపీ నాయకులు కూడా తెలుసు. అయితే కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు నాటకాలు ఆడుతున్నారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారే తప్ప వడ్లు కొనేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తలేరెందుకో చెప్పాలె. పంజాబ్‌కు ఒక న్యాయం మనకో న్యాయమా..? కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది. రైతులను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకునే కుటిల పన్నాగాలు పన్నుతుంది. రైతులందరూ బీజేపీ నాయకులు ఆడుతున్న నాటకాలపై అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ రైతుల పక్షపాతి. ఇది వందకు వందశాతం నిజం. మోడీ, బీజేపీ నాయకులు మాటలు నమ్మితే తలె అమ్మి చెప్పులు కొనుక్కోవాల్సిన గతి పడుతుంది. ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తే కేంద్రం కొనాలనేది వాస్తవం. బీజేపీ నాయకులు మాట్లాడే తీరు తలా తోక లేకుండా ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాలి.
– వంగల వెంకట్ రెడ్డి, సిర్సపల్లి (హుజూరాబాద్)
రైతులకు తిప్పలు..
మోడీ ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి రైతులకు తిప్పలు తప్పుతలేవు. అరిగోస పెడుతున్నరు. అన్ని రాష్ట్రాలలో కొన్నట్టుగా మనదగ్గరా కొనాలె. ఓకాడ కొంటరు.. మరోకాడ కొనరా.. ఈ పంటను దళారులకు అమ్మితే లాగొడి పైసలు కూడా రావు. వడ్ల కల్లాలు పెట్టియ్యాలే పండించిన వడ్లు కొనుగోలు చేయాలే. మొన్నటిదాక టీవీల జూసిన. పంజాబ్ రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తే దెబ్బకు మోడీ దిగచ్చిండు. గట్లనే మేం కూడా చేసుడైతది. కేసీఆర్ సారు ఎన్నిసార్లు ఢిల్లీకిపోయి మా రాష్ర్టాన్ని చూడాల్నని ఎన్నిసార్లు చెప్పినా గిట్లనే జేతుండ్రు. ఈ వడ్ల సంగతి బీజేపోళ్లు పట్టించుకోరూ. ఏమన్నంటే అన్ని కేంద్రమే ఇత్తుంది అని చెప్పుతరు. సాతనైతే వడ్లు కొనాలని కేంద్రానికి చెప్పాలే. అప్పుడే మా లాంటి రైతులు యాజ్జేత్తరు.
– బొడ్డు దేవయ్య, రైతు ధర్మారం (కోనరావుపేట)