చిగురుమామిడి, మార్చి 21: ‘వాహనాలు జాగ్రత్తగా నడపాలి. మామూలుగానే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక తాగి నడిపితే మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే. దీనిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు చిగురుమామిడి పోలీసులు. అలాగే నిరంతరం తనిఖీలు చేపడుతూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.
తరచూ పట్టుబడితే లైసెన్స్ రద్దు
మద్యం తాగిన తర్వాత వాహనదారులు రహదారిపైకి వస్తామంటే మాత్రం కుదరదు. మందుబాబులు వాహనం నడుపుతూ వరుసగా మూడుసార్లు పట్టుపడితే వారి లైసెన్సు రద్దు అవుతుంది. ఒకసారి లైసెన్స్ రద్దు చేస్తే మళ్లీ తీసుకోవడం కష్టం. వాహన దారుల వెంట వెళ్లేవారికి భద్రత కల్పించడం కోసమే ఈ చట్టం తీసుకువచ్చారు.
నిత్యం తనిఖీలు..
మండలంలోని 17 గ్రామాల్లో ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ రాత్రి వేళల్లో వాహనాల తనిఖీతో పాటు బ్రీత్ ఎనలైజర్‌తో శ్వాస పరీక్షలు చేస్తున్నారు. వాటి ఫలితాల ద్వారా కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం తాగి నడిపిన వారిని పట్టుకొని ఒకొకరికి రెండు వేల చొప్పున జరిమానా విధిస్తున్నారు. నెలకు సుమారు 277 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఆరు నెలల్లో ఇప్పటి వరకు సుమారు 2,222 చలాన్లు విధించగా, మాస్క్ లేకుండా వాహనాలు నడపడంపై 1,452 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆరు నెలల్లో రూ.7.64 లక్షలు జరిమానా రూపంలో ప్రభుత్వానికి వాహనదారులు చెల్లించారని ఎస్ఐ తెలిపారు.
వాహనదారులకు కౌన్సెలింగ్
రోడ్డు ప్రమాదాలను వీలైనంత వరకు నియంత్రించాలనే ఉద్దేశంతో ఎస్ఐ దాస సుధాకర్.. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి ఎకడికకడ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. పట్టుబడిన నిందితులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పిలిచి, మద్యం తాగి వాహనం నడపడం వల్ల వచ్చే సమస్యల గురించి వివరించి మార్పు తీసుకువస్తున్నారు. మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి వారితో ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించే వారిని పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
మంచి ఫలితాలు వస్తున్నాయి
మండలంలో విస్తృతంగా నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ తనిఖీలతో వాహనదారులు మద్యం తాగి నడిపేందుకు జంకుతున్నారు. గ్రామాల్లో బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తూ తనిఖీలు చేపడుతున్నాం. దీంతో తాగి వాహనం నడిపేవారిలో చాలా వరకు మార్పు వస్తున్నది. పైఅధికారుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని భావిసున్నాం.
– దాస సుధాకర్, చిగురుమామిడి ఎస్ఐ