కొత్తగూడెం సింగరేణి, మార్చి 21: రష్యా -ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సింగరేణి సంస్థ చేస్తున్న బొగ్గు ఉ త్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సింగరేణి సంస్థకు అవసరమైన (అమ్మోనియం నైట్రేట్ )పేలుడు పదార్థాల దిగుమతి తగ్గింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. సంస్థ వ్యాప్తంగా ఉన్న ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, అండర్‌గ్రౌండ్ మైన్లలో ఉత్పత్తికి ముందు బ్లాస్టింగ్ చేసి బొగ్గును వెలికితీస్తుంటారు. బ్లాస్టింగ్‌కు అవసరమైన పేలుడు పదార్థాల ముడిసరుకు ఎంతో అవసరం. ఇందుకు గానూ అమ్మోని యం నైట్రేట్ అవసరం ఉంటుంది. పేలుడు పదార్థాల తయారీ సంస్థలకు ముడిసరుకు దిగుమతి కాలేదు. దీంతో ఆ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై కూడా పడుతున్నది. ఓసీపీల్లో ఓబీని తొలగించి ఆ తరువాత బొగ్గును వెలికితీస్తుంటారు. ఓబీ, బొగ్గును వెలికితీసే సమయంలో బ్లాస్టింగ్ చేస్తారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్, రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతి పూర్తిగా తగ్గింది. సంస్థకు నిత్యం 700 నుంచి 800 టన్నుల వరకు అవసరం ఉంటుంది. టెండర్‌కు అనుగుణంగా ఎన్‌హెచ్ 4, ఎన్వో3లను ఏర్పాటు చేయలేకపోతున్నారు. కాగా, మొత్తం కలిస్తే 600 టన్నులు దాటడం లేదు. దీని వల్ల బొగ్గు ఉత్పత్తి రోజుకు 80 శాతానికి మించి దాటడం లేదు.
తగ్గిన బొగ్గు ఉత్పత్తి
రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా సంస్థకు అవసరమైన పేలుడు ప దార్థాలను టెండర్‌దారులు సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో సంస్థ నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తిలో నిత్యం 80 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. మిగతా 20 శాతం ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది. కొత్త టెండర్లను ఆహ్వానించాం. టెండర్లు ఓకే అయితే పేలుడు పదార్థాల కొరత రాకుండా చూస్తాం. ఇందు కు అవసరమైన చర్యలు తీసుకుంటాం.
-చంద్రశేఖర్, డైరెక్టర్(సింగరేణి)