తిమ్మాపూర్ రూరల్, మార్చి 21: నమో..నారసింహా.. చల్లంగ చూడు స్వామి అంటూ నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనృసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని వేడుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి వారిని రథంపై ప్రతిష్టించారు. సోమవారం ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకున్నారు. సీపీ సత్యనారాయణ, తహసీల్దార్ రాజ్‌కుమార్‌తో పాటు జిల్లాలోని ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మొక్కులు చెల్లించుకున్నారు. రథం వద్ద పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లు కట్టారు. మండలం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి సైతం భక్తులు తరలి వచ్చి, కుటుంబాలతో స్వామివారి సన్నిధిలో గడిపారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన ప్రముఖులను ఆలయ చైర్మన్ దన్నమనేని శ్రీనివాస్‌రావు, ఈవో శంకర్ ఆధ్వర్యంలో సత్కరించారు. సాయంత్రం స్వామివారిని గర్భగుడికి తీసుకెళ్లారు. వేదపండితుల ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి, నాగబలి, మహాపుష్పారాధన, ద్వాదశారాధన, ఏకాంతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ముగించారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో 100 మంది పోలీసు సిబ్బంది బందోబస్త్ నిర్వహించినట్లు ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి తెలిపారు.