స్తంభంపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
గోపాల్రావుపేటలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవానికి హాజరు
ధర్మారం, మార్చి 18: నియోజకవర్గంలోని పలు ఆలయాలను రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ధర్మారం మండలం గోపాల్రావుపేట గ్రామంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవానికి మంత్రి హాజరు కాగా, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆయనను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గోపాల్‌రావుపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, వెల్గటూరు మండలం స్తంభంపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పెగడపల్లిలోని స్వయంభూ రాజరాజేశ్వరస్వామి ఆలయం, నంచర్లలోని రామాలయం అభివృద్ధికి రూ.50లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించామని మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ధి పనులు త్వరగా చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయించామని, వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పనులు వేగంగా పూర్తి చేయించాలని మంత్రి ఈశ్వర్ సూచించారు. స్తంభంపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, రోడ్డు నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయించామని, టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు.
రచ్చపల్లిలో కాకతీయుల కాలంలో నిర్మితమైన సాంబమూర్తి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. కాగా, ఆలయ ఆవరణలో లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించగా, భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, సర్పంచ్ జనగామ అంజయ్య, ఉప సర్పంచ్ సంకసాని సతీశ్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, విండో డైరెక్టర్ భారత స్వామి, గోపాల్రావుపేట ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు లింగాల ఆనందరావు, వైస్ చైర్మన్ సిరిపురం రాజేశం, సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు సందినేని కొమురయ్య, మేకల రాజయ్య, పంజాల శ్రీనివాస్, నస్పూరి రాజేందర్, కొండ అశోక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.