కరీంనగర్, చొప్పదండిలో విస్తృత ఏర్పాట్లు
పరిశీలించిన కలెక్టర్, మేయర్
కార్పొరేషన్, మార్చి 15 : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ గురువారం కరీనంగర్‌లో పర్యటించనున్నారు. నగరంతోపాటు చొప్పదండిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అమాత్యుడికి ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఫెక్ల్సీలు, కటౌట్లు, గులాబీ జెండాలతో దారులన్నీ గులాబీమయం చేశారు. ముఖ్యంగా మానేరు బ్రిడ్జి వద్ద సుందరీకరణ పనులు చేస్తూనే.. రాంనగర్‌లోని మార్క్‌ఫెడ్ గ్రౌండ్ సభా వేదికను రెడీ చేస్తున్నారు. మరోవైపు చొప్పదండిలోనూ పర్యటన ఉండగా, అక్కడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించి, జడ్పీ బాలుర పాఠశాల క్రీడామైదానంలో బహిరంగ సభకు హాజరుకానుండగా, అందుకు కావాల్సిన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత చొప్పదండిలో సభాస్థలాన్ని, పనుల ప్రారంభోత్సవ స్థలాన్ని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు.
ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ కర్ణన్
మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. మేయర్ సునీల్‌రావుతో కలిసి మంగళవారం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అల్గునూర్ బ్రిడ్జి వద్ద మిషన్ భగీరథ పైలాన్‌తోపాటు 24 గంటల మంచినీటి సరఫరా, మానేరు రివర్ ఫ్రంట్, స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల శిలాఫలకాల పనులను పరిశీలించారు. ఉజ్వల పార్ సమీపంలో 5 కోట్ల వ్యయంతో నిర్మించిన బీసీ స్టడీ సరిల్ భవనాన్ని, రాంనగర్ మార్ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వేదికను పరిశీలించి, మాట్లాడారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో యువత తరలివస్తారని, ఆ మేరకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్ శ్రీకాంత్, డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర్, నీటిపారుదల శాఖ ఎస్ఈ శివకుమార్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.