కమాన్‌చౌరస్తా, మార్చి 4: మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటేనే రాజకీయాల్లో రాణిస్తారని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. నగరంలోని జ్యోతీరావు ఫూలే మైదానంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం బొమ్మ హేమాదేవి వేదికపై మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత-నాయకత్వం’ అంశంపై నిర్వహించిన సదస్సు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఏ తప్పు చేయకున్నా సస్పెన్షన్‌కు గురవడం తనను కలచివేసిందన్నారు. తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఓ ప్రజాప్రతినిధిని కలవడానికి వెళ్లిన తన తండ్రిని ఎవరూ పట్టించుకోలేదని, అప్పుడే తనలో లీడర్ కావాలన్నా పట్టుదల పెరిగిందన్నారు.
దాంతోనే 2006లో జడ్పీటీసీగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. తాను ఐదో తరగతి చదువుతున్నప్పుడు తమ పాఠశాలకు కలెక్టర్ వచ్చారని, కలెక్టర్‌కు ఇచ్చే గౌరవాన్ని చూసి, అప్పుడే తాను కూడా కలెక్టర్ కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి చదివి ఐఏఎస్ సాధించినట్లు తెలిపారు. విద్యార్థినులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదుగాలని సూచించారు. పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ, విద్యార్థినులు ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. కరీంనగర్ వ్యవసాయ మారెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత మాట్లాడుతూ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు.
అనంతరం వివిధ కళాశాలల విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ సునీత సమాధానాలు ఇచ్చారు. సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన పాటలు, వివిధ పాఠశాలల విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాగా, సాయంత్రం కవితా సమాలోచన, యక్షగానం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, డీఎంహెచ్‌వో డాక్టర్ జువేరియా, మెప్మా డీఎంవో శ్రీవాణి, బిజినెస్ ఉమెన్ రజినీరెడ్డి, సీడీపీవోలు, పుస్తక ప్రదర్శన నిర్వాహకులు చంద్రమోహన్, సతీశ్, ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణ, వివిధ కళాశాలల విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు.
సందడిగా పుస్తక ప్రదర్శన
జ్యోతీరావు ఫూలే మైదానంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చి తిలకించారు. పలు పుస్తకాలను కొనుగోలు చేశారు. జిల్లా కవులు, రచయితలు ఏర్పాటు చేసిన స్టాల్‌తో పాటు పలు రచనలు, పుస్తకాలు ఉన్న స్టాళ్లు సందర్శకులతో కళకళలాడాయి.