ఉమ్మడి జిల్లాలో వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు
వేములవాడలో మార్మోగిన శివనామస్మరణ
తరలివచ్చిన దాదాపు 2.50 లక్షల మంది భక్తులు
ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు అల్లోల, గంగుల దంపతులు, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి
టీటీడీ తరఫున అందజేసిన ఏఈవో మోహన్‌రాజు
కనులపండువలా మహాలింగార్చన
నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పూజలు
ఆలయాల అభివృద్ధికి పెద్దపీట : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి : మంత్రి కమలాకర్
వేములవాడ/వేములవాడటౌన్, మార్చి 1: ‘హరహర మహాదేవ’, ‘శంభోశంకర..’ అంటూ సాగిన శివ నామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో ఆలయాలు పోటెత్తాయి. రాష్ట్ర నలుమూలల నుంచే గాక పొరుగు రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తకోటితో వేములవాడ రాజన్న సన్నిధి జనసంద్రమైంది. దాదాపు 2.50 లక్షల మందితో ఎక్కడ చూసినా రద్దీ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ దంపతులు, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీటీడీ తరఫున ఏఈవో మోహన్‌రాజు.. రాజరాజేశ్వర స్వామివార్లకు పట్టువస్ర్తాలు సమర్పించారు. రాత్రి అనువంశిక అర్చకులచే ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చన కనుల పండువలా సాగగా, అర్ధరాత్రి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.
వేములవాడ రాజన్న సన్నిధి మంగళవారం శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎటుచూసినా భక్తజన సందోహం కనిపించింది. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచే ఆలయానికి చేరుకున్నారు. సుమారు 2.5 లక్షల మంది తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో ధర్మగుండంలో స్నానాలకు అనుమతి రద్దు చేయడంతో షవర్ల కింద స్నానం చేసి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. తలనీలాలతో పాటు బంగారం(బెల్లం) మొక్కులను సమర్పించారు. క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉండి మరీ స్వామి వారిని దర్శించుకున్నారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ బద్దిపోశమ్మ, భీమేశ్వర, నగరేశ్వర, కేదారేశ్వర ఆలయాల్లోనూ బారులు తీరారు. భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు సేవలందించారు.
స్వామి వారికి పట్టువస్ర్తాలు..
రాజరాజేశ్వరస్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ దంపతులు, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పట్టువస్ర్తాలు సమర్పించారు. అంతకుముందు వీరికి కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఈవో రమాదేవి, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, మంత్రులు పట్టువస్త్రాలను ఆలయంలోకి తీసుకెళ్లి అర్చకుల వేద మంత్రాల మధ్య స్వామివారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అద్దాల మండపంలో మంత్రులు ఐకేరెడ్డి, గంగుల దంపతులు, రసమయికి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు శాలువాలతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఆనవాయితీలో భాగంగా టీటీడీ తరఫున ఉదయం 7.30 గంటలకు ఏఈవో మోహన్‌రాజు, ఇతర అధికారులు కలిసి స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. వీరికి అద్దాలమండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా, దేవాదాయశాఖ కమిషనర్, ఈవో స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఇక్కడ సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు సత్యప్రసాద్, కిమ్యానాయక్, ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, పట్టణ సీఐ వెంకటేశ్, రూరల్ సీఐ బన్సీలాల్, తహసీల్దార్లు మునీందర్, నక్క శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వేమలవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.
ఆలయాల అభివృద్ధికి పెద్దపీట : మంత్రి అల్లోల
ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, గొప్పగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అలాగే సాగునీరు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధిలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. మహాశివరాత్రి రోజున రాజన్నను దర్శించుకోవడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని చెప్పారు.
సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి : మంత్రి గంగుల
యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తయిన వెంటనే రాజన్న ఆలయంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారిస్తారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాజన్నకు పట్టువస్ర్తాలు సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆలయాల అభివృద్ధితో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తామని చెప్పారు. తెలంగాణలో రాజన్న ఆలయం పెద్దదని, సాధ్యమైనంత త్వరగా ఆలయాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. మరికొద్ది రోజుల్లో పనులు శరవేగంగా జరుగుతాయని వివరించారు.
ఘనంగా మహాలింగార్చన..
వేములవాడకు చెందిన అనువంశిక బ్రాహ్మణులతో ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. 366 లింగాలు, 366 జ్యోతులను అందంగా అలంకరించి వేదమంత్రాలతో పూజలు చేశారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో దాదాపు 128 కుటుంబాలకు చెందిన బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే రాత్రి 11.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 3.30 గంటల వరకు ఆలయ స్థానాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు.
మార్మోగిన శివానమస్మరణ
41రోజులుగా దీక్షలో లీనమైన దాదాపు వెయ్యి మందికిపైగా శివస్వాములు ‘ఓం నమశ్శివాయ..’ అంటూ చేసిన శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం, రాజన్న అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఇరుముడులను విప్పి, మాల విరమణ చేశారు.