ఉమ్మడి జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి
కరీంనగర్ నెట్వర్క్, మార్చి 1 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కనులపండువగా జరిగాయి. ప్రధానంగా కోటిలింగాల, సారంగాపూర్ దుబ్బరాజన్న, ఓదెల మల్లన్న, జనగామ త్రిలింగేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కాగా, ఆయాచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పూజలు చేశారు. ధర్మపురి అక్కపెళ్లి రాజేశ్వరాలయం, పెగడపల్లిలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి వారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ గంగాపరమేశ్వర ఆలయంలో మంత్రి గంగుల కమలాకర్ పూజలు చేశారు. కోరుట్లలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు.. జగిత్యాలలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రాధిక దంపతులు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్, మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్‌కుమార్ పూజలు చేశారు. ఓదెల మల్లన్న, ఉప్పరపల్లిలో శివగట్టు మల్లికార్జునస్వామి వారిని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, పవర్‌హౌస్ కాలనీలోని శివాలయం, జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే చందర్ దర్శించుకున్నారు. మానకొండూర్ మండలం గంగిపల్లి, కొండపల్కల, ఈదుల గట్టెపల్లి, లింగాపూర్ గ్రామాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు పూజలు చేశారు. గంగాధర మండలం కొండన్నపల్లి సహస్త్రలింగేశ్వరాలయం, వెంకంపల్లి రామలింగేశ్వరాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పూజలు చేశారు.