హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 25: విద్యార్థులు తమ భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరుతారని, వారి ఆశయాలను నెరవేర్చుకునేందుకు అధ్యాపకులు, యాజమాన్యం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, కిట్స్ చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మండలంలోని సింగాపూర్ కిట్స్‌లో ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ అధ్యక్షతన శుక్రవారం సెమినార్ హాల్లో ఎన్బీఏ (నేషన్బోర్డు ఆఫ్ అక్రిడేషన్ ) ప్రదానం సక్సెస్ మీట్ నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధ్యాపకులు తమ పరిశోధనను ఉత్తమ జర్నల్‌లో ప్రచురించాలని, మంచి జర్నల్స్‌ను రెఫర్ చేస్తూ ప్రాజెక్ట్‌లు తయారు చేయాలని సూచించారు. అధ్యాపకులు తయారు చేసే ప్రాజెక్ట్‌ల యొక్క ప్రమాణం ఉన్నతంగా, సమాజంలోని రోజు వారి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగకరంగా ఉండాలన్నారు. విద్యార్థి యొక్క వ్యక్తిత్వం పెంపొందించాలని కోరారు. కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు వచ్చేందుకు కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను కెప్టెన్ అభినందించారు. అక్రిడేషన్ పొందడంలో సహకరించిన పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే, కిట్స్ కార్యదర్శి వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థులకు కావాల్సిన వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈఈఈ, ఈసీఈ, సీఎస్సీ కోర్సులకు ఎన్బీఏ ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కిట్స్ డైరెక్టర్ ఇంద్రనీల్, రిజిస్ట్రార్ వెంకటయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.