బోయినపల్లి, ఫిబ్రవరి 28: రైతన్న సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలతో భరోసా కల్పిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇటీవల బోయినపల్లి మండలం మానువాడలో రైతు పొత్తూరి పరశురాములు మృతిచెందగా, సోమవారం రాత్రి ఆయన సతీమణి లక్ష్మికి రూ.5 లక్షల బీమా ప్రొసీడింగ్ కాపీని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇంతకు ముందు పొలాలకు సాగునీరు లేక రైతులు ఇతర దేశాలకు వలస వెళ్లి జీవితాలు నాశనం చేసుకున్నారని, కానీ ఇవ్వాళ కేసీఆర్ సర్కారు కృషితో రైతు కుటుంబాలు సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణంతో చివరి మడి వరకు సాగునీరు అందుతున్నదని, బీళ్లన్నీ సాగులోకి వచ్చి సిరులు పండుతున్నాయని పేర్కొన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ కృషితోనే సాధ్యమైందని కొనియాడారు.
రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే రైతుబీమా లాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓర్వలేక పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కాగా, గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యేకు వెంకట్రావ్పల్లి వద్ద టీఆర్ఎస్ యూత్ కమిటీ అధ్యక్షుడు కట్ట గోవర్ధన్ ఆధ్వర్యంలో 200 మోటార్ సైకిళ్లతో ర్యాలీ తీసి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, యూత్ కమిటీ సభ్యుడు గోవర్ధన్, మానువాడ సింగిల్విండో చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపీటీసీ గీత, ఉప సర్పంచ్ పుల్లారెడ్డి, నాయకులు ఐరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.