మూడు రోజుల వేడుకకు ముస్తాబైన రాజన్న సన్నిధి
2.50 కోట్లతో ఏర్పాట్లు
రెండు వేల మంది కళాకారులతో శివార్చన
అడుగడుగునా సీసీ కెమెరాలు
1800 మంది పోలీసులతో పటిష్ట భద్రత
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించనున్న మంత్రులు
సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు : ఈవో
వేములవాడ/ వేములవాడటౌన్, ఫిబ్రవరి 27 : పేదల కోవెలగా ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబైంది. సోమవారం నుంచి మూడురోజులపాటు నిర్వహించనున్న జాతర ఉత్సవాలకు సరికొత్త శోభను సంతరించుకున్నది. చలువపందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యం, పార్కింగ్, సౌకర్యాలతో సర్వసన్నద్ధమైంది. ఆలయ యంత్రాంగం భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు 1800 మంది పోలీసు సిబ్బందిని నియమించింది. రంగు రంగుల తోరణాలు, పరిశుభ్రమైన దారులు, విద్యుద్దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు సాదర స్వాగతం పలుకుతున్నది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 28వ తేదీ సోమవారం నుంచి మార్చి 2వ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. సుమారు 3 లక్షల మంది భక్తులు తరలిరానున్నందున రూ.2.50 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. భక్తుల విడిదికోసం 3.10 లక్షల చదరపు అడుగుల మేర చలువ పందిళ్లు, ఆధ్యాత్మికత ఉట్టి పడేలా పార్కింగ్ స్థలంలో రెండు వేల మంది కళాకారులతో శివార్చనను నిర్వహించనున్నామని చెప్పారు. రోజూ 25 లక్షల మందికి సరిపడేలా తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణకట్టకు అదనంగా మరోకటితో పాటు రాజేశ్వరపురంలో తాత్కాలిక కల్యాణకట్టలు ఏర్పాటు చేశామని 100 మంది నాయీబ్రాహ్మణులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు
మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం తరఫున మంగళవారం శ్రీ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్ర్తాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమర్పించనున్నారు. అలాగే, యేటా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడి ఆలయ అధికారులు పట్టు వస్ర్తాలు అందజేయనున్నారు.
ఆలయానికి ఉచిత ప్రయాణం
ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 770 ప్రత్యేక బస్సులు నడుపుతున్నదని అధికారులు తెలిపారు. అలాగే తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా 14మినీ ఉచిత బస్సులు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వేములవాడకు చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, కామారెడ్డి నుంచి 70 కి.మీ, సిద్దిపేట నుంచి 50 కి.మీ, నిజామాబాద్ నుంచి 120 కి.మీ, కోరుట్ల నుంచి 50 కి.మీ, కరీంనగర్ నుంచి 32 కి.మీ, హుజూరాబాద్ నుంచి 60 కి.మీ, వరంగల్ నుంచి 85 కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు తరలిరానున్నారు.
పుష్కలంగా మంచినీరు.. 3 లక్షల లడ్డూలు
భక్తులకు పుష్కలంగా మంచినీరును అందుబాటులో ఉంచుతున్నారు. ఇందుకు 3లక్షల వాటర్ , లక్ష మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు. వీటితోపాటు తాత్కాలిక నల్లాలు, నీటి సరఫరాకు ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచితంగా వాటర్ బాటిళ్లను అందజేయనున్నారు. అలాగే, మూడు లక్షల లడ్డూలను తయారు చేశామని ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరావు తెలిపారు. లడ్డూ ధర ఒక్కటి రూ.20 అని, దర్శనం అనంతరం దక్షిణద్వారం వద్ద ప్రసాదాలను విక్రయిస్తామన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు..
రాజన్న ఆలయ చెరువు ప్రాంతంలోని మైదానంలో ‘శివార్చన’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు వేల మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, శివతాండవం, ఒగ్గుడోలు, భక్తి సంగీతం, పేరిణీ శివతాండవం, దీప నృత్యం, శివలీలలు, శివార్చన, ఒగ్గుకథా విన్యాసం, కోలాటం, పేరిణీ నృత్యపరంపర, లయ విన్యాసం, శివారాధన, శివశంభో కూచిపూడి నృత్యం, వాగ్గేయకార వైభవం, కర్రసాము, పేరిణీ మృదంగ నాదం, బోనాల కోలాటం, తబలా తరంగిణి, అఘోర నృత్యం లాంటి కార్యక్రమాలతో జాతరకు వచ్చిన భక్తులకు కనులవిందు చేయనున్నారు.
ఇబ్బందులు లేకుండా దర్శనం
మహాశివరాత్రి జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. భక్తులు అవసరమయ్యే వసతి, తాగునీరు, తగిన భద్రతను కల్పిస్తున్నాం. కరోనా నేపథ్యంలో భక్తులందరూ మాస్కులు ధరించి రావాలని కోరుతున్నాం. ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ చేయడమే కాకుండా మాస్కులు అందజేస్తాం.
– ఎల్ రమాదేవి, కార్యనిర్వాహణాధికారి, వేములవాడ
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వేములవాడలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్‌బాబు కోరారు. ఆదివారం ఆలయ అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతర విజయవంతంగా జరిగేందుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్‌శాఖ, మున్సిపల్ అధికారులు సహాయ సహకారం అందించాలన్నారు. భక్తులకు సకాలంలో దర్శనం, ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.
– ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్‌బాబు
ఏడుచోట్ల హెల్ప్‌లైన్ సెంటర్లు..
జాతరకు వచ్చే భక్తులకు సమాచారమిచ్చేందుకు ఏడు చోట్ల హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ఇక్కడ సమాచారం ఇవ్వడంతో పాటు కరోనా నేపథ్యంలో థర్మల్ స్క్రీనింగ్ చేయడం, మాస్క్‌లు ధరించాలని అవగాహన కల్పించనున్నారు.