బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మెడికోలు
కివ్లోనే చిక్కుకున్న జిల్లా విద్యార్థులు
కర్ఫ్యూ విధించిన ఉక్రెయిన్ ప్రభుత్వం
బయటికి వచ్చే మార్గం లేదంటూ ఆవేదన
కొందరు వినిస్తియా నుంచి రొమెనియా చేరుకున్నా ప్రవేశం లేక తిప్పలు
గేట్లు దాటేందుకు యత్నించగా గాల్లోకి సైనికుల కాల్పులు lఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
కరీంనగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) ;ఉక్రెయిన్లో ఉన్న మన మెడికోలు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంభయంగా గడుపుతున్నారు. రష్యా ప్రధాన లక్ష్యంగా చేసుకున్న ఉక్రెయిన్ రాజధాని కివ్లో బాంబుల మోతమోగడం, నిరంతరాయంగా కర్ఫ్యూ విధించడంతో బంకర్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇక కొందరు సాహసించి విన్నిస్తియా నుంచి బార్డర్ చేరుతున్నా రొమేనియాలోకి అనుమతిలేకపోవడంతో పడిగాపులు పడుతున్నామని ఫోన్ చేసి చెబుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పిల్లలను రప్పించాలని కోరుతున్నారు.
ఉక్రెయిన్లో ఉన్న మెడికోలు భయం భయంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తమ పిల్లలు అనుభవిస్తున్న నరకాన్ని తలుచుకుని ఇక్కడి తల్లి దండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. రష్యా ప్రధాన లక్ష్యంగా చేసుకున్న ఉక్రెయిన్ రాజధాని కివ్లో ఉన్న కొందరైతే బయటికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ నిరంతరాయంగా కర్ఫ్యూ విధించడంతో విద్యార్థులు బంకర్లలోనే కాలం గడుపుతున్నారు. చుట్టూ బాంబులు పడుతున్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని తల్లి దండ్రులకు ఫోన్లు చేసి చెబుతున్నారు. కొందరికి ఫోన్ కమ్యూనికేషన్ కూడా లేక పోవడంతో ఇక్కడ తల్లి దండ్రుల్లో టెన్షన్ మొదలైంది.
కాగా వినిస్తియా నుంచి రొమెనియా బార్డర్కు వెళ్లిన కొందరు మెడికోలు గేటు దాటే ప్రయత్నం చేయగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మెడికోలు ఉక్రెయిన్ రాజధాని కివ్తోపాటు విన్నిస్తియా, జఫ్రోజియా, జక్టోరియా రాష్ర్టాల్లోని పలు మెడికల్ యూనివర్సిటీల్లో మెడిసిన్ చదువుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఫైనల్ ఇయర్ సెమిస్టర్స్ అటెండ్ అవుతుండగా, మరి కొందరు కొత్తగా ఫస్టియర్లో గత వారం పది రోజుల కిందనే చేరారు. అంతలోనే యుద్ధం మొదలై అనుకోని అవాంతరం ఎదురు కావడంతో ఏం చేయాలో తోచని స్థితిలో మె డికోలు పడిపోయారు. కొందరు సాహసించి బార్డర్ చేరుతుండగా మరి కొందరికి బంకర్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. విన్నిస్తియా నుంచి కొందరు రొమేనియా బార్డర్కు చేరుతున్నారు.
బార్డర్కు చేరుకున్న తర్వాత కూడా వాళ్లకు కష్టాలు త ప్పడం లేదు. ఇండియన్ ఎంబసీ చెప్పినట్లుగా వాళ్ల ను రొమేనియాలోకి అనుమతించడం లేదు. దీంతో వాళ్లు అక్కడే పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మెడికోల తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో రకమైన బాధలు, కష్టాలను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.