కరీంనగర్, జగిత్యాలకు చెందిన మెడికోల రాక
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పికప్ చేసుకున్న తల్లిదండ్రులు
గుండెలకు హత్తుకొని ఉద్వేగం
కరీంనగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి అష్టకష్టాలు పడి కొందరు మెడికోలు వచ్చేశారు. రొమేనియా మీదుగా ఆదివారం తెల్లవారు జామున ఢిల్లీకి చేరుకున్న మెడికోలు రాత్రి వరకు హైదరాబాద్ అక్కడి నుంచి కరీంనగర్‌కు వచ్చేశారు. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన దుర్గం నిదీష్ జయాకర్, జక్కు లలితా దేవితోపాటు జగిత్యాలకు చెందిన అలిగేటి లోహిత, ఎలేటి హిమబిందు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నలుగురు ఒకే ఫ్లైట్‌లో భారత్‌కు చేరుకున్నారు. ఆదివారం పొద్దంతా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిని రాత్రి 8 గంటల సమయంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వారి తల్లి దండ్రులు పికప్ చేసుకున్నారు. జక్కు లలితా దేవి, దుర్గం నిదీష్ జయాకర్ ఉక్రెయిన్‌లోని చెర్నివిస్టీలోని బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నారు. వీరికి ఉక్రెయిన్, రొమేనియా బార్డర్‌కు కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే రోడ్డు మార్గంలో బయలుదేరిన వీళ్లు రొమేనియా బార్డర్ చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు.
8 కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చారు. రొమేనియా బార్డర్ చేరుకున్న తర్వాత ఇండియన్ ఎంబసీ వారు పికప్ చేసుకున్నారు. అక్కడి నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న రొమేనియా దేశంలోని హెన్రి కొవడ అనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బస్సులో బయలు దేరారు. అక్కడ శనివారం రాత్రి 7.40కి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కారు. ఆదివారం తెల్లవారు జామున 3.15 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణకు చెందిన 17 మందిని అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పికప్ చేసుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు. పొద్దంతా అక్కడ రెస్టు తీసుకున్న తర్వాత సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 7.15 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. లలితా దేవి తల్లి దండ్రులు జక్కు అర్చన, వినోద్‌కుమార్ పికప్ చేసుకున్నారు. ఉద్వేగంతో లలితను గుండెలకు హద్దుకున్నారు. ఈ సందర్భంగా లలిత తండ్రి వినోద్‌కుమార్ మాట్లాడుతూ తన కూతురు లలితాలాంటి ఎందరో పిల్లలు అనేక కష్టాలకు ఓర్చి భారత్‌కు తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు థాంక్స్
నా పేరు ఏలేటి హిమబిందు. మాది జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఎంబీబీఎస్ చేస్తున్నా. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో చాలా భయపడ్డాం. మా తల్లిదండ్రులు చాలా లక్ష్మారెడ్డి – జ్యోతి చాలా టెన్షన్ పడ్డారు. ఇండియన్ ఎంబసీ వారు దగ్గరుండి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు విమానాల్లో క్షేమంగా ఇండియాకు చేరుకున్నాం. అక్కడి నుంచి స్వగ్రామానికి వచ్చా. తమను క్షేమంగా ఇండ్లకు రప్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు.
–ఎలేటి హిమబిందు, ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం.
ఇంత త్వరగా వస్తుందనుకోలేదు..
ఉక్రెయిన్‌లో ప్యానిక్ సిట్యువేషన్లో ఉన్న మా అమ్మాయి ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఉక్రెయిన్‌లోని మెడికోలు రప్పించేందుకు పూర్తి ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అక్కడి నుంచి వచ్చిన పిల్లలకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించారు. మా కూతురులాంటి చాలా మంది పిల్లలు చిక్కుకుని ఉన్నారు. వాళ్లు కూడా త్వరగా భారత్‌కు చేరుకుంటారని, వాళ్ల తల్లిదండ్రులు కూడా మాలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. రొమేనియా నుంచి హైదరాబాద్ వరకు పూర్తి ఉచితంగా తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మేలును ఎప్పటికీ మర్చిపోము.
– జక్కు వినోద్‌కుమార్, లలిత దేవి తండ్రి.