హైలెవల్ వంతెన నిర్మాణంతో 20 గ్రామాల ప్రజలకు మెరుగు పడిన రవాణా సౌకర్యం
మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి 27: వేగురుపల్లి-నీరుకుళ్ల హైలెవల్ వంతెన నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలు ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి. రవాణా సౌకర్యం మెరుగుపడడంపై ప్రయాణికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మానకొండూర్ మండలం వేగురుపల్లి, సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామాల మధ్య వంతెన లేక రెండు వైపుల ప్రజలు దశాబ్దాల తరబడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పక్కనే ఉన్న గ్రామాలకు సైతం కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్లే వారు. ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు మానకొండూర్ మండలం వేగురుపల్లి, సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల గ్రామాల మధ్య తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ. 40.20 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టింది. 12-1-2016 సంవత్సరంలో శంకుస్థాపన చేయగా, స్వల్పకాలంలోనే పూర్తి చేశారు. దీంతో సుల్తానాబాద్, ఓదెల మండలం, మానకొండూర్, వీణవంక మండలాల్లోని దాదాపు 20 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
దూరభారం తగ్గింది
వంతెన పూర్తి కాక ముందు సుల్తానాబాద్‌కు మానకొండూర్ మీదుగా కరీంనగర్ నుంచి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం 2 కి.మీ ప్రయాణించి చేరుకుంటున్నం. ఎన్నో ఎండ్ల గోస తీరింది. దూరభారంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతున్నది.
–పడాల ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్, వేగురుపల్లి
పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి
వంతెన పూర్తయింది. కానీ రెండు వైపులా గ్రామాల పరిధిలో ల్యాండ్ ఈక్వేషన్ (భూసేకరణ) చేసి అప్రోచ్ స్పాన్స్ నిర్మాణం చేపట్టాలి. రెయిలింగ్‌ను సైతం ఏర్పాటు చేసి, వంతెనను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలి.
–పెరుమాండ్ల గోవర్ధన్, వేగురుపల్లి