టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్
హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 27: దళితబంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలని టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆకాంక్షించారు. ఆదివారం హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కమలాపూర్ మండల ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులతో దళితబంధుపై అవగాహన, సంస్థాగత సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ఇకడి దళితుల అదృష్టమన్నారు. లబ్ధిదారులు ప్రావీణ్యం ఉన్న వాటిని యూనిట్‌గా ఎంపిక చేసుకుంటే త్వరగా గ్రౌండింగ్ కావడంతోపాటు అధిక లాభాలు వచ్చే అవకాశముందన్నారు. కిరాణా దుకాణాలు, గూడ్స్ వాహనాలను ఎంపిక చేసుకోవాలని, అలాగే డెయిరీ ఫామ్‌లతో అత్యధిక లాభాలు ఆర్జించవచ్చునని, ప్రభుత్వం నూతనంగా పౌల్ట్రీ ఫారాలను కూడా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని గెల్లు వివరించారు. నియోజకవర్గంలో 2500 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్ పూర్తిచేసి వాహనాలు, వస్తువులను అప్పగించామని పేర్కొన్నారు. మార్చి 7 లోగా నియోజకవర్గం మొత్తం గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. లబ్ధిదారులు పథకం ద్వారా వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కమలాపూర్ ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.