101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
ప్రథమ స్థానంలో హుజూరాబాద్ డివిజన్
జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుకు అధికారుల కృషి
ముకరంపుర, ఫిబ్రవరి 27: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కుటుంబాల్లో విద్యుత్ వెలుగులు నింపుతున్నది. ఉచిత కరెంటు వారి ఇండ్లల్లో కమ్ముకున్న చీకట్లు తొలగించి కాంతులను వెదజల్లుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ కేవలం 50 యూనిట్ల వరకే ఇచ్చేవి. పథకం అమలు తీరు నామమాత్రంగా మారడంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆర్థికంగా వెసులుబాటు లేక.. సకాలంలో బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొని విద్యుత్ చౌర్యం కేసుల్లో చిక్కుకొని విలవిలలాడారు. స్వరాష్ట్రంలో ఈ దుస్థితిని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. గతంలో ఉన్న 50 యూనిట్ల పరిధిని 101 యూనిట్లకు పెంచింది. నెలకు రూ.250 వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ అండగా నిలుస్తున్నది. సమాజంలో ఎస్సీ, ఎస్టీల గౌరవాన్ని పెంచేలా సగర్వంగా ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నది. క్షేత్రస్థాయిలో లో-వోల్టేజీ, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. లైన్ల విస్తరణ, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, స్తంభాల ఏర్పాటుతో పాటు అవసరమైన అన్ని పనులు చేపట్టి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నది.
జిల్లాలో పరిస్థితి ఇలా
విద్యుత్ శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో 32,619 మంది ఎస్సీ, 861 మంది ఎస్టీ వినియోగదారులు ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు 28,950 మంది ఎస్సీ, 434 మంది ఎస్టీ వినియోగదారులు మాత్రమే ఉచిత విద్యుత్ కోసం కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం వీరికి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేశారు. మరో 3,669 మంది ఎస్సీ, 427 మంది ఎస్టీ వినియోగదారులు ఉచిత విద్యుత్ కోసం కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉన్నది. కుల ధ్రువీకరణ పత్రమే ఉచిత విద్యుత్ వర్తింపునకు కీలకం. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందించాలని సూచించారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు గ్రామాలు, పట్టణాల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ వినియోగదారుడు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రథమ స్థానంలో హుజూరాబాద్
ఉచిత విద్యుత్ పథకం అమలులో హుజూరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. హుజూరాబాద్ రూరల్ సెక్షన్లో 1,613 మంది వినియోగదారులకు గానూ 1,605 మందిని గుర్తించారు. 8 మంది ఎస్టీ వినియోగదారులు ఉండగా అందరికీ వర్తింపజేశారు. హుజూరాబాద్ టౌన్లో 1,258 మంది ఎస్సీ వినియోగదారులకు గానూ 1,231 మందికి వర్తింపజేశారు. మరో 27 మంది తమ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంది. 35 మంది ఎస్టీ వినియోగదారులు ఉండగా వీరంతా ఉచిత విద్యుత్ పథకం పరిధిలోకి వచ్చారు.
మీసేవలో దరఖాస్తు
ఉచిత విద్యుత్ పథకం వర్తింపునకు తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రంతో మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తును సంబంధిత సెక్షన్ ఏఈ కార్యాలయంలో అందించాలి. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేస్తారు. ఒక వేళ యజమాని మరణిస్తే కుటుంబ సభ్యులు పేరు మార్పిడి కోసం అఫిడవిట్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అవగాహన కల్పిస్తున్నం
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులంతా ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాలు, పట్టణాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా క్షేత్రస్థాయిలో విద్యుత్ అధికారులు, సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నం. -వీ గంగాధర్, ఎస్ఈ