ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య
ఆయా కార్మిక సంఘాల నాయకులతో సమావేశం
తెలంగాణచౌక్, ఫిబ్రవరి 27: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 28, 29 తేదీల్లో చేపట్టే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య పిలుపు నిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయం (బద్ధం ఎల్లారెడ్డి భవనం)లో ఆదివారం సమ్మెపై వివిధ కార్మిక సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ లాభసాటి సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో విక్రయిస్తున్నదని ఆరోపించారు. ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేసిన బీజేపీ నాయకులు అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోటి ఉద్యోగాల విషయమై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను హరించే విధంగా లేబర్ కోడ్ విధానం తీసుకొచ్చారని, వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, టీఎన్టీయూసీ నాయకుడు కళ్యాడపు ఆగయ్య, ఆయా కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.