మహిళలు, యువతుల సంక్షేమానికి అండగా కేసీఆర్
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లతో భరోసా
రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదు
బీజేపీ నాయకులు అనవసర విమర్శలు మానుకోవాలి
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మారం/ధర్మపురి, ఫిబ్రవరి 26: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే నంబర్‌వన్‌గా ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. మన పథకాలు చూసి సరిహద్దు రాష్ర్టాల ప్రజలు వారి ప్రాంతాలను మన రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా ధర్మపురి పట్టణంలో రూ.8.90కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50పడకల మాతాశిశుసంరక్షణ కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. తర్వాత ధర్మారంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో 144 మందికి రూ.1,44,16,704 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసి, మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలతో భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నదని మండిపడ్డారు.
సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు..
తల్లీబిడ్డల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. భావితరం ఆరోగ్యంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని, ఈ మేరకు సర్కారు దవాఖానాల్లో సకల సౌకర్యాలు కల్పించారని వివరించారు. ఈ క్రమంలోనే ప్రసవ మరణాలు సున్నా శాతానికి పడిపోయాయని చెప్పా రు. ఆయా సమావేశాల్లో తహసీల్దార్ ఆర్.వెంకట లక్ష్మి, ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మ, సర్పంచ్ పూస్కూరు జితేందర్‌రావు, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, జడ్పీ, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, ధర్మారం ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, ఉప సర్పంచ్ ఆవుల లత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ తదితరులు ఉన్నారు.