కిక్కిరిసిన ఎస్ఆర్ గార్డెన్
1575 మందికిపైగా రాక
ప్రముఖ కంపెనీల్లో 456 మందికి కొలువులు
అపాయింట్మెంట్ లెటర్లు అందించిన మంత్రి ఈశ్వర్
వెల్గటూర్, ఫిబ్రవరి 26: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలన్న ఒక లక్ష్యంతో మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో రాజారాంపల్లిలో నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచన మేరకు డీడీయూ-జీకేవై, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైస్ ప్లేస్మెంట్ వారి సహకారంతో ఎస్ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన మేళాకు దేశంలోని ప్రముఖ 48 కంపెనీల నిర్వాహకులు వచ్చారు. జిల్లా నలుమూలల నుంచి 1510 మంది నిరుద్యోగ యువతీ, యువకులు తరలివచ్చారు. పదో తరగతి నుంచి పీజీ విద్యార్హత కలిగిన ఉద్యోగాల కోసం నిర్వహించిన ఈ జాబ్ మేళాతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా వచ్చిన వారందరి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అందులో అర్హతలను బట్టి 456 మందికి నియామక పత్రాలు అందించారు. ఇందులో సూర్య టెక్ సొల్యూషన్ కంపెనీకి ఎంపికైన ఐదుగురికి ఆర్డర్ కాపీలు అందించారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి ఈశ్వర్
‘చదువుకున్న ప్రతి విద్యార్థి కాలం కలిసిరావాలని కూర్చోకుండా వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకోవాలి. ఉద్యోగం చిన్నదా, పెద్దదా, ప్రభుత్వమా, ప్రైవేటా అని చూడకుండా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని మంత్రి కొప్పుల పిలుపునిచ్చారు. దేశంలోని ప్రముఖ కంపెనీలు మన వద్దకే వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మేళాకు సహకరించిన వారందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ రవి మాట్లాడుతూ చదువుకున్న విద్యార్థులంతా తల్లిదండ్రుల మీద ఆధార పడకుండా ఏదో ఉద్యోగంలో చేరి చేదోడు వాదోడుగా ఉండాలని సూచించారు. అనంతరం వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న హైస్ కంపనీ ప్లేస్మెంట్ సీఈఓ మనీశ్‌ను అభినందించారు. ఇక్కడ ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, సర్పంచ్ గెల్లు చంద్రశేఖర్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, డీఆర్డీఓ పీడీ వినోద్, ఎంపీడీఓ సంజీవరావు, ఏపీఎం చంద్రకళ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
సంతోషంగా ఉంది..
నేను బీటెక్ దాకా చదివిన. ఏం చేయాలో తెలియక ఖాళీగానే ఉంటున్న. రాజారాంపల్లిలో జాబ్ మేళా గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చిన. సూర్యటెక్ కంపెనీలో జాబ్ వచ్చింది. నెలకు రూ.15వేల జీతం. చాలా సంతోషంగా ఉంది.
– దూది మల్లేశ్, ఆరేపల్లి, ధర్మపురి మండలం