ఎమ్మెల్సీ భానుప్రసాదరావు
గెలిచిన తర్వాత తొలిసారిగా సొంతమండలానికి రాక
ఊరూరా వెల్లువెత్తిన అభిమానం
అడుగడుగునా ఘన స్వాగతం
టీఆర్ఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో ఘన సన్మానం
ఎలిగేడు, ఫిబ్రవరి 26: ఎలిగేడు మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతా నని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు ప్రకటించా రు. ఇందుకు విరివిగా నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మూడోసారి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత శనివారం తొలిసారిగా సొంతమండలానికి వచ్చిన ఆయనకు ఊరూరా అభిమానం వెల్లువెత్తింది. ముఖ్యంగా పుట్టిన ఊరైన లోకపేట పులకించింది. పార్టీ మండల శాఖ రెండు వేల బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించి అపూర్వ స్వాగతం పలికింది. ర్యాలీ పొడుగునా నినాదాలతో హోరెత్తించింది. అనంతరం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో శాలువాలతో ఘనంగా సన్మానించింది. అంతకుముందు భానుప్రసాదరావు ఎలిగేడు అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దాసరితో కలిసి పూలమాల వేశారు. అనంతరం రూ. 26 లక్షలతో నిర్మించిన ఎలిగేడు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావును ఆయన సొంత గ్రామమైన లోకపేటతో పాటుగా మండలంలోని 12 గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు, పలు కుల సంఘాల నాయకులు, యువకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలిగేడు నుంచి కాచాపూర్ దాకా, ఎలిగేడు నుంచి పెద్దాపూర్ వరకు డబుల్‌రోడ్డు, రాముల-ర్యాకల్‌దేవ్‌పల్లి నాగలింగేశ్వర ఆలయం నుంచి ఎలిగేడు దాకా రహదారి నిర్మాణానికి కృషిచేస్తానన్నారు. ఎలిగేడు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. తనపై అభిమానాన్ని ప్రదర్శించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, వీపీ బుర్ర వీరస్వామిగౌడ్, ఎలిగేడు సర్పంచ్ బూర్ల సింధూజ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నారాయణపల్లి సర్పంచ్ మాడ కొండాల్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, కేడీసీసీ మాజీ డైరెక్టర్ కే వెంకటేశ్వర్రావు, మాజీ సర్పంచ్ ప్రసాదరావు, ఎలిగేడు సింగిల్ విండో అధ్యక్షుడు గోపు విజయభాస్కర్‌రెడ్డి, వీపీ చింతిరెడ్డి గణపతిరెడ్డి, నాయకులు మహేశ్వర్‌రావు, బూర్ల వెంకట సత్యం, మండిగ రాజనర్సయ్య, తానిపర్తి మోహన్‌రావు ఉన్నారు.