ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
టీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం
మెట్పల్లి, ఫిబ్రవరి 26: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. శనివారం మెట్పల్లి పట్టణంలోని వెంకట్‌రెడ్డి ఫంక్షన్ హాల్లో కోరుట్ల నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ విస్త్రృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వారు లబ్ధిపొందేలా సహకరించాలని, ప్రతిపక్షాల ఆరోపణలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని సూచించారు. చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు. రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ, ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడంలో బీజేపీ నాయకులు సిద్ధహస్తులని విమర్శించారు. ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా వారియర్స్ క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర టెక్నాలజీ సేవల సంస్థ చైర్మన్ జగన్మోహన్రావు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్లు సతీశ్‌రెడ్డి, దినేశ్ చౌదరి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, ఉపాధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మల్లాపూర్, మెట్పల్లి మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.