మెట్పల్లి రూరల్, ఫిబ్రవరి 21: మెట్పల్లి మండ లం మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల అధ్వానంగా ఉండేది. పాఠశాల అభివృద్ధికి సహకరించాలని స్థానిక సర్పంచ్ పీసు తిరుపతిరెడ్డి, విద్యా కమిటీ అధ్యక్షుడు బందిల రాజరెడ్డి పూర్వ విద్యార్థులను కోరారు. వారి విన్నపం మేరకు పాఠశాల అభివృద్ధికి విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, ఓ రై ల్వే ఉద్యోగి ముందుకొచ్చారు. ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేం ద్రాలకు రంగులు వేయించి కళకళలాడేలా చేశారు.
ఆకర్షణీయంగా.. ఆకట్టుకునేలా..
మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామంలోని ప్రభు త్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్ర భవనాలు ఆకర్షణీయంగా తయారయ్యాయి. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు రూ. మూడు లక్షలు వెచ్చించి రంగులు వేయించారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డ పూర్వ విద్యార్థి కథలాపురం సూర్యం రూ. 1.25 లక్షలు, ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పీసు గంగారెడ్డి రూ. 30 వేలు, దుబాయిలో ఉన్న పూర్వ విద్యార్థి క్యా తం జలపతిరెడ్డి రూ.25 వేలు, రైల్వే ఉద్యోగి సురకంటి లింగారెడ్డి రూ.20 వేలు వెచ్చించి బడిని రం గులతో అందంగా తీర్చిదిద్దారు. గోడలపై వేసిన వివిధ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచ పటం, భారతదేశ చిత్రపటం, తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్, సర్వేపల్లి రాధాకృష్ణ, సైన్స్‌కు సంబంధించిన పటాలు గోడలపై ఆకట్టుకునేలా పెయింటింగ్ వేయించారు. బడి బాగుకు ముందుకు వచ్చిన విద్యార్థులను స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.
ఒకే మాటకు ముందుకొచ్చారు..
కళావిహీనంగా ఉన్న బడి బాగుకు సహకరించాలని విదేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు, ఇక్కడే ఉన్న మరో రైల్వే ఉద్యోగిని కోరాం. అభివృద్ధికి ముందుకొచ్చారు. వీరి సహకారంతోనే ఉన్నత, ప్రాథమిక పాఠశాలు, అంగన్వాడీ భవనాలను అందంగా తీర్చిదిదాం.
– పీసు తిరుపతిరెడ్డి, సర్పంచ్ (మేడిపల్లి)
సంతృప్తిగా ఉంది..
ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యమైనందుకు సంతృప్తిగా ఉంది. నేను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి నా వంతు కృషి చేశా. భవిష్యత్‌లో బడి బాగు కోసం నాకు తోచినంత సహకారమందిస్తా.
– కథలాపురం సూర్యం, పూర్వ విద్యార్థి (ఎన్ఆర్ఐ)