హుజూరాబాద్‌టౌన్, ఫిబ్రవరి 20: క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక హైసూల్ క్రీడా మైదానంలో హుజూరాబాద్ డివిజన్ స్థాయి క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరుగగా, దీనికి ముఖ్య అతిథిగా శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటమి గెలుపునకు నాంది కావాలన్నారు. ఓడిపోయిన వారు నిరాశకు లోను కావొద్దని సూచించారు. కాగా, డివిజన్ స్థాయి క్రీడాపోటీలు వారం రోజులుగా ఉత్సాహంగా సాగాయి. ఆదివారం ఫైనల్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జమ్మికుంట జట్టు 15 ఓవర్లలో 144 పరుగులు చేయగా, హుజూరాబాద్ లెజెండ్ జట్టు 14.4 ఓవర్లలో 145 పరుగులు చేసి విజయం సాధించింది. విజేత జట్టుకు పట్టణ సీఐ వీరబత్తిని శ్రీనివాస్‌తో కలిసి బండ శ్రీనివాస్ మొదటి బహుమతి రూ.15 వేల నగదు, ట్రోఫీ అందజేశారు. అలాగే జమ్మికుంట జట్టుకు ద్వితీయ బహుమతిగా రూ.8వేల నగదుతో పాటు జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రతాప తిరుమల్‌రెడ్డి, ఆర్గనైజర్ సతీశ్, అభిరాం, అశోక్, శ్రీనివాస్, శ్యామ్, రాంచంద్రం, మైకెల్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.