రుద్రంగి, ఫిబ్రవరి 20: అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని, సంక్షేమంలో మనమే నంబర్‌వన్‌గా ఉన్నామని, ఇవ్వాళ దేశమంతా కేసీఆర్‌వైపే చూస్తున్నదని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. ఆదివారం ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులతో కలిసి రుద్రంగి మండలం మానాలతోపాటు గిరిజన గ్రామాల్లో 50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ చొరవతోనే తండాలకు మహర్దశ పట్టిందని, గ్రామ పంచాయతీలుగా మారాయని చెప్పారు. మారుమూల గ్రామమైన ఒక్క మానాల నుంచే ఎనిమిది నూతన గ్రామపంచాయతీలు ఏర్పడడం చాలా గొప్ప విషయమన్నారు. ‘నాడు నేను కలలుగన్న మానాల అభివృద్ధిని నేడు చూస్తున్నా’ అని చెప్పారు. మానాల, గిరిజన తండాల ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను ఎప్పటికీ మీ బిడ్డనే.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి’ అని కోరారు. కాగా, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వారు చేస్తున్నట్లుగా బీజేపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. అంతకుముందు గైదిగుట్టతండాలో 6.50 కోట్లతో నిర్మిస్తున్న కేజీ టూ పీజీ బాలికలు గురుకుల పాఠశాలను పరిశీలించారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపన
బడితండాలో 1.20 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ, గిరిజన తండాలను కలుపుతూ 1.80కోట్లతో 6.5 కిలోమీటర్ల పొడవున్న రింగు రోడ్డుపై వేసిన బీటీ రోడ్డు, 8.50 లక్షలతో నిర్మించిన మానాల-మరిమడ్ల రోడ్డు, 14 కోట్లతో రుద్రంగి నుంచి దేవక్కపేటకు వేసిన డబుల్ రోడ్డు పనులు, యాదవ సంఘం భవనం, మహిళా సంఘానికి ప్రహరీ, 5కోట్ల తో విద్యుత్లైన్ల మరమ్మతు పనులను ప్రారంభించారు. అలాగే, పలు గ్రామాల్లో సీసీరోడ్లు, 20 లక్షలతో నాలుగు పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ కలెక్టర్ అనురాగ్ జయంతి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డీఎంహెచ్‌వో సుమన్ మోహన్‌రావు, డీఎస్పీ చంద్రకాంత్, తహసీల్దార్ శ్రవణ్, ఎంపీడీవో శంకర్, సీఐ శ్రీలత, వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేగావత్ తిరుపతి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.