కార్పొరేషన్, ఫిబ్రవరి 20: కరీంనగర్ నడిబొడ్డులో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చేపడుతున్న పార్కు పనులు వేగంగా సాగుతున్నాయి. స్మార్ట్‌సిటీ మొదటి విడుత నిధులతో మైదానంలో పార్కు పనులు చేపట్టారు. నగర శివారులో తప్ప మధ్యలో ఎక్కడా కూడా పార్కులు లేకపోవడంతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్‌రావు ఈ స్థలంలో పార్కును అభివృద్ధి చేయాలని సమాలోచనలు చేశారు. దానికి అనుగుణంగా స్మార్ట్‌సిటీ నిధులు రూ. 7.50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మధ్యలో ఎన్నికలు, కరోనా నేపథ్యంలో పార్కు అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగింది. కాగా, ఇటీవల పార్కు అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రజాప్రతినిధులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఏప్రిల్ నాటికి మొత్తం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆ దిశగా బల్దియా అధికారులు చర్యలు మొదలుపెట్టారు.
ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి
ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చేపడుతున్న పార్కులో సందర్శకుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు తయారు చేశారు. ముఖ్యంగా పిల్లలతో పాటు వృద్ధులు కూడా వచ్చి సేద తీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పార్కు పనులు పూర్తయితే సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ పార్కులో ఓపెన్ ఏయిర్ థియేటర్‌తో పాటు యోగా, ఫిట్నెస్ సెంటర్లు, వాకింగ్ ట్రాక్‌లు, పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగైదు పౌంటేన్లు, పచ్చదనం ఉండేలా అందమైన మొక్కలు నాటారు. నగర వాసులు ఉదయం, సాయంత్రం వచ్చి వాకింగ్ చేసేందుకు సింథటిక్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. కూర్చునేందుకు సిమెంట్ బేంచీలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, పార్కు పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లు బల్దియా ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. మిగతా పనులను గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర అవతరణ వేడుకల నాటికి అందుబాటులోకి
నగరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చేపడుతున్న పార్కు అభివృద్ధి పనులను ఏప్రిల్‌లోగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాం. పనులు వేగంగా సాగుతున్నయి. మరింత వేగంగా పనులు పూర్తి చేసే లా చర్యలు తీసుకుంటున్నం. సందర్శకులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నం. ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి, జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నం. పనులు పూర్తయితే నగరం మధ్యలో అత్యంత సుందరమైన పార్కు ప్రజలకు కనిపిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నం. – మేయర్ వై సునీల్‌రావు