హుజూరాబాద్, ఫిబ్రవరి 20 :వానకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడం పరిపాటిగా మారింది. పలు కాలనీల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ఈ సమస్య ఇక శాశ్వతంగా తొలగిపోనున్నది. వరద కాల్వ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.50 కోట్ల నిధులు కేటాయించగా.. పనులు సైతం జోరందుకున్నాయి.
మున్సిపల్ అధికారులు పక్కా ప్రణాళికతో భారీ వరద కాల్వ నిర్మాణం చేపడుతున్నారు. మొదట ఆరు ఫీట్ల వెడల్పు, ఎత్తు కొలతలతో ప్రారంభించారు. చివర దాదాపు 12 ఫీట్ల వెడల్పు, ఎత్తు ఉండేలా నిర్మిస్తున్నారు. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ పనులు మరో రెండు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో మోరీ చిన్నగా ఉండడంతో ఓ మోస్తరు వాన పడినా మురుగు నీరు రోడ్లపైకి చేరేది. పలు కాలనీల ప్రజలు వాన కాలంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. మురుగు నీరు రోడ్డుపై నిలువడం, ఖాళీ ప్లాట్లలో చేరడంతో పారిశుధ్యం లోపించేది.
మూడు కిలో మీటర్ల మేర నిర్మాణం
వరద కాల్వను స్టీలు, కంకర, ఇసుకతో పటిష్టంగా నిర్మిస్తున్నారు. సిల్ట్ తొలగించేందుకు వీలుగా అక్కడక్కడ కాల్వ మీద కొంచెం వదలి పెడుతుండగా.. దాదాపు 10 ఇంచుల మందంతో సిమెంట్ బిళ్లలతో మూసివేస్తున్నారు. భారీ వరద కాల్వను మూడు కిలో మీటర్ల మేర నిర్మిస్తున్నారు. విద్యానగర్లోని శ్రీరామ ఐటీఐ దగ్గర నుంచి గాంధీ నగర్ చివర, కాకతీయ కాలనీలోని బజాజ్ షోరూం మీదుగా వరంగల్ రోడ్డులో హెచ్పీ పెట్రోలు పంపు వరకు కాల్వ పనులు సాగుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే 500 మీటర్లకు పైగా వరంగల్ రోడ్డులో కాల్వ నిర్మాణం పూర్తయింది.
యుద్ధ ప్రాతిపదికన పనులు
పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో నిర్మాణం పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. ఈ భారీ వరద కాల్వ నిర్మాణంతో పలు కాలనీల ప్రజల ఇక్కట్లు తీరుతాయి. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొంత అసౌకర్యం కలిగినా కాలనీల ప్రజలు సహకరించాలి.
– వెంకన్న, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్