గంగాధర, ఫిబ్రవరి 20: రైతాంగానికి మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పక్కాగా పంటల వివరాల నమోదు చేపట్టింది. ఏఈవోలు నేరుగా అన్నదాతల ఇండ్ల వద్దకే వెళ్లి ఎంత భూమి ఉన్నది.. ఎంత వీస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారు.. తదితర అంశాలను అడిగి తెలుసుకొని రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. పంటల నమోదు కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులు, ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్లు పర్యవేక్షిస్తున్నారు. రైతుల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సిబ్బంది సేకరించిన వివరాలతో పోల్చి చూస్తున్నారు.
రైతుల నుంచి వివరాల సేకరణ
గంగాధర మండలంలో 33 గ్రామాలను 5 క్లస్టర్లుగా అధికారులు విభజించా రు. మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి 30277 ఎకరాలు ఉండగా, మొత్తం 13541 మంది రైతులు ఉన్నారు. మండలంలో ఇప్పటికే 80 శాతం రైతుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో గంగాధర క్లస్టర్ పరిధిలో 5880 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా శుక్రవారం వరకు 1081 మంది రైతుల నుంచి 2455 ఎకరాల్లో వివరాలు సేకరించారు. బూరుగుపల్లి క్లస్టర్ పరిధిలో 5338 ఎకరాల వ్యవసాయ భూమి ఉం డగా 1162 మంది రైతుల నుంచి 1995 ఎకరాల్లో, కురిక్యాల క్లస్టర్ పరిధిలో 5526 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 1100 మంది రైతుల నుంచి 1878 ఎకరాల్లో, గర్శకుర్తి క్లస్టర్ పరిధిలో 6318 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 925 మంది రైతుల నుంచి 1761 ఎకరాల్లో, మల్లాపూర్ క్లస్టర్ పరిధిలో 7215 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 979 మంది రైతుల నుంచి 1954 ఎకరాల్లో వివరాలు సేకరించారు.
పంటల వివరాల నమోదు ఉద్దేశం
గ్రామాల్లోని ప్రతి సర్వే నంబర్లో రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు అనే దానిపై సమగ్ర నివేదిక తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయడానికి దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు రాష్ట్రంలో పంటల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో తప్పా మరెక్కడా అధికారులు రైతుల వద్దకే వెళ్లి పంటల వివరాలు నమోదు చేసే కార్యక్రమం లేదు. రైతులు వేసిన పంటల వివరాలు సేకరించి సమగ్ర నివేదిక తయారు చేయడంతో పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం ముందస్తుగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. పంట చేతికి వచ్చిన సమయంలో రైతుల నుంచి ఎంత దిగుబడి వస్తుందో అందుకు అవసరమైన సదుపాయాలు, గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, గోడౌన్ల ఏర్పాటు వంటి వసతుల కల్పనపై సమగ్ర అవగాహన ఉంటుంది. పంటకు మద్దతు ధర కల్పించి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది.
ప్రతి రైతు నుంచి వివరాలు సేకరిస్తున్నం
పంటల నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని 33 గ్రామాల్లో ప్రతి రైతు వద్దకు వెళ్లి పంటల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నం. ఇప్పటికే 5247 మంది రైతుల నుంచి 10083 ఎకరాల్లో వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసినం. రైతుల నుంచి వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడంతో భవిష్యత్‌లో మార్కెటింగ్‌కు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి అవకాశం ఉంటుంది.
-రాజు, మండల వ్యవసాయాధికారి
పంటల నమోదును పర్యవేక్షిస్తున్నం
గ్రామాల్లో వ్యవసాయాధికారులు చేపడుతున్న పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నం. రైతుల వద్దకు వెళ్లి ఏ పంటలు వేస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నం. అధికారులు సేకరించిన వివరాలతో పోల్చి చూస్తున్నం. రైతుల నుంచి ముందస్తుగానే వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడంతో మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి అవసరమైన అంచనాలను రూపొందించడానికి అవకాశం ఉంటుంది.
-పుల్కం గంగన్న, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్