ధర్మారం/ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు సేవా కార్యక్రమాలు చేసి శ్రీకారం చుట్టారు. కొందరు ఏకంగా పేదలకు ఇండ్లు కట్టించి గృహప్రవేశం చేయించి నిరుపేదలకు నివాస కానుక ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ధర్మారం మండలం కొత్తూరులో కొలుముల దామోదర్ యాదవ్ తన ఫౌండేషన్ ద్వారా నిరుపేదకు ఇల్లు కట్టించి ఇచ్చారు. అలాగే ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త గోవర్ధన్ గౌడ్ అదే గ్రామానికి చెందిన ర్యాకం నర్సవ్వ ఇల్లు కట్టించి సీఎం పుట్టిన రోజున గృహ ప్రవేశం చేయించారు.
ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రేషవేని మల్లేశ్ కరోనాతో మృతి చెందగా అతని భార్య లావణ్య, ఆమె ఇద్దరు పిల్లలు పూరి గుడిసెలో ఉంటున్నారు. వారి పరిస్థితిని చూసి చలించిన అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల స్వర్ణలత- దామోదర్ యాదవ్ దంపతులు కొలుముల దామోదర్ ఫౌండేషన్ ద్వారా వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. దీంతో దామోదర్ యాద వ్ పంపిన డబ్బులతో ఫౌండేషన్ సభ్యులు దగ్గరుండి లావణ్య పూరిగుడిసె వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో రేకుల షెడ్ ఇంటిని ఇటీవల పూర్తి చేశారు. ఈ క్రమంలో గురువారం స్థానిక ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డితో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ఎం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్నేహలత ప్రారంభించారు. ఇదే ఇంటి వద్ద ఆమె కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ జన్నదిన వేడుకలను నిర్వహించారు.
ఫౌండేషన్ ద్వారా గ్రామానికి చెందిన నిరుపేద యువతికి పుస్తెమట్టెలు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్నేహలత మాట్లాడుతూ దామోదర్ యాదవ్ విదేశాల్లో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం, నిరుపేదరాలికి సొంత ఖర్చులతో ఇంటిని కట్టించి సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా బహూకరించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, గ్రామ సర్పంచ్ తాళ్ల మల్లేశం, ఉప సర్పంచ్ బానోతు రాజేశ్వరి రాజేశం నాయక్, ఫౌండేషన్ ఫౌండర్ తల్లిదండ్రులు కొలుముల గంగయ్య, మల్లవ్వ, ఫౌండేషన్ ఇన్చార్జి వేల్పుల నాగరాజు, సభ్యులు ఆవుల ఎల్లయ్య, ఆవుల లత, ఆవుల మల్ల య్య, జంగ మహేందర్, కత్తెర్ల సది, ఆవుల మహేశ్, జెల్ల సంపత్, టీఆర్ఎస్ మహిళ మండలాధ్యక్షురాలు గుజ్జేటి కనకలక్ష్మీ, పార్టి నాయకులు సూరమల్ల శ్రీనివాస్, పుల్లకొల్ల లింగమూర్తి, మద్దెల నర్సయ్య, సాయిని కొమురయ్య పాల్గొన్నారు.
బొప్పాపూర్‌లో..
బొప్పాపూర్‌కు చెందిన ర్యాకం నర్సవ్వ భర్త నర్సయ్య 30 ఏండ్ల క్రితం మృతి చెందాడు. 11 ఏండ్ల క్రితం ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోగా అనేక ఇబ్బందులు పడింది. ఉన్న ఇల్లు కూడా కూలిపోగా అద్దె ఇంట్లో ఉంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ కష్టపడి ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమైంది. ఉన్న డబ్బుతో కొంతవరకు నిర్మాణం చేసి మధ్యలో ఆపేయగా విషయం తెలుసుకున్న బొప్పాపూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త గోవర్ధన్‌గౌడ్ ఇంటిని ముఖ్యమంత్రి జన్మదినం నాటికి పూర్తి చేసి ఇవ్వాలనుకున్నాడు. ఇంటిని పూర్తి చేసి గురువారం డప్పు చప్పుళ్లతో పండుగ వాతావరణంలో నర్సవ్వను గృహప్రవేశం చేయించి రూ.51వేల కట్నం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
మరోవైపు గొల్లపల్లిలో ఉంటు న్న మహారాష్ట్రకు చెందిన దినసరి కూలీ మారు తి ఇటీవల ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబానికి టీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సాయం చేశారు. మారుతికి భార్య నలుగురు కూతుల్లు ఉన్నారు. ఈక్రమంలో ఏఎంసీ చైర్మన్ రూ.2 వేలు నగదు సాయం అందించగా చిన్నారులకు టీఆర్ఎస్ యూత్వింగ్ ఆధ్వర్యంలో నూతన వస్ర్తాలను అందించారు. ఇక్కడ టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండలాధ్యక్షు డు వర్స కృష్ణహరి, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, మాజీఎంపీపీ ఎలుసాని మోహన్‌కుమార్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, సింగిల్‌విండోచైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు గడ్డి నర్సయ్య, ల్యాగల సతీశ్, ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి, ముత్యాల శేఖర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.