మంచిర్యాల, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం కార్మికలోకం కదం తొక్కింది. సింగరేణిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటాకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. దీక్షలకు కార్మికులు, కార్మిక కుటుంబాలు, అన్ని వర్గాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలుపడంతో కార్మికుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం.. నేడు సింగరేణి రక్షణ కోసం మరో పోరాటానికి సిద్ధమని తేల్చిచెప్పింది. తెలంగాణకే కొంగుబంగారం లాంటి సింగరేణిని తమ దోస్తులైన కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తెలంగాణపై కక్ష కట్టిందని కార్మిక లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. లాభాల బాటలో ఉన్న సింగరేణిని వేలం వేయాలని చూస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని టీఆర్ఎస్ హెచ్చరించింది. సింగరేణి పరిధిలోని జేబీఆర్వోసీ-3, కేకే-6, శ్రవనపల్లి ఓపెన్‌కాస్ట్, కోయగూడెం బ్లాక్‌లను వేలానికి పెట్టడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని, ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నది. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని, ఊర్లలోకి రానివ్వకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. టీఆర్ఎస్, టీబీజీకేఎస్, అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. మున్ముందు చేసే ఏ పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
మరో ఉద్యమాన్ని రగిలిస్తాం..
తెలంగాణ ఉద్యమంలో నల్ల సూరీళ్ల పాత్ర మరువలేనిది. ఆ ఉద్యమంలో భగ్గుమన్నట్లుగానే సింగరేణి రక్షణకు మరో ఉద్యమాన్ని రగిలిస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల బాటలో నడుస్తున్న సింగరేణిపై కన్నేసి ప్రైవేటీకరణకు తెరలేపింది. కేంద్రం సింగరేణిపై కక్ష గట్టినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారు. నాలుగు బ్లాకుల వేలంతో మొదలు పెట్టి సంస్థను మొత్తం వారి అనుకూల అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నది. బీజేపీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే చలో ఢిల్లీ, చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాలు చేపడుతాం. బీజేపీని బొందపెట్టయినా సింగరేణిని, కార్మిక హక్కులను కాపాడుతాం. కార్మికులు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలి.
– బాల్క సుమన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్
ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
సింగరేణి సంస్థ తెలంగాణకు గుండెకాయలాంటిది. ఈ సంస్థను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వబోం. రణదీక్ష పేరుతో బుధవారం ముగ్గురం ఎమ్మెల్యేలం చేపట్టిన దీక్ష విజయవంతమైంది. కార్మికులు కేంద్రం వైఖరిపై ఎంతో ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ అంటే ప్రధానమంత్రి మోదీకి వివక్ష ఎక్కువ. దేశంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కోపంతో తెలంగాణకు నిధులు, ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ఇవ్వడంలేదు. ప్రాణత్యాగాలు చేసైనా సింగరేణి బొగ్గు గనులను కాపాడుకుంటాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గని కార్మికుల కోపాగ్నికి ఆహుతికాక తప్పదు. సంస్థను నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. మా తెలంగాణ బొగ్గు బావులను మాకే ఇవ్వాలి. గనుల ప్రైవేటీకరణపై ఇక్కడి బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం సిగ్గుచేటు.
– దివాకర్‌రావు, ఎమ్మెల్యే, మంచిర్యాల
బీజేపీ నాయకులను తరిమికొట్టాలి
రాష్ట్రంలో బీజేపీ నాయకులను తిరగకుండా తరిమి కొట్టాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను ఉపసంహరించుకుంటుంది. ఎక్కడికక్కడ ఇక్కడి బీజేపీ నాయకులను అడ్డుకుంటే ఢిల్లీకి పరుగెత్తి మోదీ కాళ్ల మీద పడి ఒప్పిస్తారు. రాష్ట్రంలో ఎలాంటి సమ్మెలు లేకుండా అధిక లాభాలతో నడుస్తున్న సింగరేణి సంస్థ పైన కేంద్రం కన్నుపడింది. ప్రైవేటీకరణ చేసి కష్టపడి నల్లబంగారాన్ని వెలికితీస్తున్న కార్మికులను ఛిన్నాభిన్నం చేయడానికి మోదీ శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణలో భాగంగా బ్లాకులకు టెండర్లు కూడా పిలిచింది. ఈ కుట్రను ఆదిలోనే తుంచి వేయాలి. కార్మిక లోకం ఇప్పుడే మేల్కొనకపోతే సింగరేణి మొత్తాన్ని ప్రైవేటీకరించి సంస్థపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడుతాయి. సకల జనుల సమ్మె స్ఫూర్తితో కార్మికులంతా ఏకతాటి పైకి వచ్చి ఇక్కడినిరసనల సెగ ఢిల్లీ పీఠం కదిలేలా మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
– దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి
ప్రాణాలు పోయినా వేలం కానివ్వం..
సింగరేణి నల్ల బంగారం యావత్ తెలంగాణకు కొంగు బంగారం. ఈ నల్ల బంగారంపై కన్నేసిన కేంద్రం సింగరేణిని నిలువునా దెబ్బతీసేందుకు కుతంత్రం చేస్తున్నది. ప్రాణాలు పోయినా సింగరేణి నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం కానివ్వం. బీజేపీ హఠావో.. సింగరేణి బచావో నినాదంతో ముందుకు సాగుతున్నాం. సింగరేణి జోలికొస్తే కార్మికుల నిరసన సెగ ఢిల్లీకి తాకుద్ది. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే బీజేపీ నాయకులను బయట తిరగనివ్వం. ఇప్పటికే తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీ సర్కారుకు సింగరేణి బొగ్గు బ్లాకుల జోలికొస్తే కార్మిక శక్తి రుచిచూపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా వేలాన్ని అడ్డుకొని తీరుతాం.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే, రామగుండం
బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమమే..
రెబ్బెన, ఫిబ్రవరి 10: రాష్ట్ర కొంగు బంగారమైన సింగరేణి సంస్థలోని బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకణ చేస్తే ఊరుకునేది లేదు. ఉద్యమాలు చేసైనా సింగరేణి సంస్థను కాపాడుకుంటాం. సింగరేణి సంస్థ పరిరక్షణకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎలాంటి ఉద్యమాలు, పోరాటాలు చేసేందుకైనా సిద్ధం. సింగరేణి సంస్థ ద్వారా పరిసర ప్రాంతాలకు చెందిన చాలా మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దానిపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక వర్గానికి అన్యాయం చేసేలా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మె చేయడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలింది. ఇప్పుడు కూడా అలాంటి ఉద్యమాలు చేయడానికి కార్మికలోకం సిద్ధంగా ఉంది.
– ఆత్రం సక్కు, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్
సింగరేణిపై మోదీ సర్కార్ కుట్ర
130 సంవత్సరాల చరిత్ర కలిగి, లక్షలాది మంది కార్మికుల కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. దీనిపై తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్‌పరం చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర పన్నుతున్నది. సిరుల మాగాణిగా ఉన్న సింగరేణి బ్లాకుల వేలాన్ని అడ్డుకొని తీరుతాం. కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కార్మికుల నిరసన సెగ ఢిల్లీకి తాకుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. సింగరేణి బ్లాకుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మొండిగా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెప్పి తీరుతాం. బొగ్గు గనుల విషయంలో గుజరాత్‌కో విధానం, తెలంగాణకో విధానం ఎలా అమలు చేస్తారు.
– గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే, భూపాలపల్లి
తట్టెడు మట్టి కూడా ఎత్తనియ్యం..
చెమట చుక్కను చిందించి దేశానికి వెలుగులు పంచే కార్మికలోకానికి అన్యాయం చేసేలా సింగరేణిలోని నాలుగు కోల్ బ్లాకులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తట్టెడు మట్టి కూడా ఎత్తనిచ్చేది లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి బీజేపీ చేసిందేమీలేదు. పైగా బంగారు తెలంగాణలో కీలక భూమిక పోషిస్తున్న సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు మొండిగా నిర్ణయాలు తీసుకుంటున్నది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించే ప్రసక్తే లేదు. అయినా మొండి వైఖరిని వీడకుంటే బీజేపీకి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతాం. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో కార్మికులతో కలిసి దశలవారీగా ఆందోళనలు చేపట్టి ఢిల్లీకి సెగ తగిలిస్తాం. ఉద్యమాల పురిటిగడ్డ అయిన తెలంగాణకు సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమాలు చేయడం కొత్తకాదన్న విషయం మోదీ ప్రభుత్వం గుర్తించాలి. కార్మికుల పక్షాన నిలిచి అండగా ఉంటాం. సింగరేణిని కాపాడుకుంటాం.
– రేగా కాంతారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్
ప్రధాని మోదీకి తగిన బుద్ధి చెప్తాం..
సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సింగరేణి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోనీయకుండా మోదీకి తగిన బుద్ధి చెప్తాం. బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యోగ భద్రత ఉండదు. సింగరేణిలో రిజర్వేషన్లు కూడా అమలు కావు. మోదీ కుట్రపూరితంగానే లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను కార్పొరేట్ శక్తులకు అమ్ముకునేందుకు దశల వారీగా బహిరంగ వేలం పెట్టి ఆ తర్వాత నష్టాలు వచ్చాయనే నెపంతో పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి కుట్రపన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాన్ని అధిగమిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నది. కార్మికులకు కూడా ప్రతి ఏడాది లాభాల వాటా పెంచుతున్నది. ఇలా లాభాల్లో ఉన్న సింగరేణిని ప్రైవేట్ పరం చేయకుండా టీఆర్ఎస్ అండతో అడ్డుకొని తీరుతాం. కార్మికులందరూ మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి.
– వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే, కొత్తగూడెం